డేర్ బాయ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభ.. భక్తులకు భారీగా అన్నదానం
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా హాజరైన కోరం సురేందర్, సూర్యం, రామ్ మహేష్

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలోని 20వ వార్డులో ‘డేర్ బాయ్స్ యూత్ కమిటీ‘ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో వార్డు ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి , ఎమ్మెల్యే సోదరుడు కోరం సురేందర్ హాజరయ్యారు. ముందుగా వారు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పండగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి సమక్షంలో అన్నదాన వితరణను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ, మండల అధ్యక్షులు సూర్యం , మండల నాయకులు రామ్ మహేష్ తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక దృక్పథంతో డేర్ బాయ్స్ యూత్ కమిటీ సభ్యులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
డేర్ బాయ్స్ యూత్ కమిటీ సభ్యులు ప్రతి ఏటా వినాయక నవరాత్రులను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. వార్డు ప్రజలందరూ ఐకమత్యంతో ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు.
అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా డేర్ బాయ్స్ యూత్ కమిటీ సభ్యులు మరియు యవజన నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు సక్రమంగా ప్రసాదాలు అందేలా ఏర్పాట్లు చేసి, వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని వార్డులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు.


