కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ ఆధ్వర్యంలో రైతులకు పంట మార్పిడి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన ,లాభదాయకమైన పంటల సాగుపై అవగాహన, పంటల వైవిధ్యకరణపై అవగాహన వంటి అంశాల గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డా.టి.సుప్రజ, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కె.వి.కె, మాట్లాడుతూ… రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా, స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మరియు లాభదాయక పంటల సాగు చేపట్టాలని సూచించారు. వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగలిగే పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు రైతులకు మంచి ఆదాయం అందించే అవకాశమున్న పంటలుగా వివరించారు. డా. కె. పవన్ చంద్ర రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన కేంద్రం, రుద్రూర్, మాట్లాడుతూ…. వ్యవసాయంలో స్థిరమైన ఆదాయం సాధించాలంటే సంప్రదాయ పద్ధతులతో పాటు ప్రాంతానుకూలమైన, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను రైతులు ఎంపిక చేసుకోవడం అవసరమని వివరించారు. పంటల మార్పిడి అంతర పంటల సాగు మరియు మిశ్రమ పంటల సాగు ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడం, పురుగులు-రోగాల సమస్యలను తగ్గించుకోవడం, మరియు ఉత్పాదకతను పెంచుకోవడం సాధ్యమవుతుందని తెలియజేశారు. డా. కె. ఇందూధర్ రెడ్డి, సేద్య విభాగం శాస్త్రవేత్త మాట్లాడుతూ… రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, ఎరువుల యాజమాన్యం, నీటి పొదుపు పద్ధతులు, మార్కెట్ ఆధారిత పంటల ప్రణాళిక వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల వైవిధ్యకరణ వైపు అడుగులు వేయడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. వైవిధ్యకరణ ద్వారా వ్యయభారం తగ్గించుకోవడం, నేల సారాన్ని కాపాడుకోవడం, పురుగు మరియు వ్యాధుల సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిపారు.శ్రీ. సాయి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి,రుద్రూర్ మాట్లాడుతూ… రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసి పంటకు మంచి ధర పొందవచ్చని తెలియజేశారు. అనంతరం రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు సందేహాలను శాస్త్రవేత్తలతో చర్చించారు. అనంతరం పంట మార్పిడిపై రైతుల అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు సేకరించారు.పాల్గొన్నరు. ఈ కార్యక్రమంలో డా. కె. పవన్ చంద్ర రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన కేంద్రం, రుద్రూర్ డా.టి.సుప్రజ, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి, కె.వి.కె , డా. కె. ఇందూధర్ రెడ్డి, సేద్య విభాగం శాస్త్రవేత్త, కె.వి.కె శ్రీ సాయి కృష్ణ, మండల వ్యవసాయ అధికారి రుద్రూర్ రైతులు పాల్గొన్నారు.