సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థుల “ప్రేమాక్షరి” మంచి ప్రయత్నం
– జర్నలిజం విద్యార్థుల పుస్తక రచన ప్రయత్నానికి ప్రశంస.
– సాహిత్యంపై విలువైన సూచనలు.
– రచనలను ప్రోత్సహిస్తున్న వర్సిటీకి అభినందనలు.
– ప్రముఖ సినీ పాటలు, కథా రచయిత సుద్దాల అశోక్ తేజ.
హైదరాబాద్ మార్చి 04,(జన సంఘర్షణ):
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు ప్రేమపై తమ మనసులోని భావాలను, సృష్టిలోని ప్రేమను, బంధాల్లోని ప్రేమామృతాన్ని, ప్రకృతి పరవశాన్ని, ప్రేమ పర్యవసానాన్ని కవితాత్మకంగా తెలియజేస్తూ ప్రేమాక్షరి పేరుతో త్వరలో అద్భుత పుస్తకం ఆవిష్కరించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ పాటలు, కథా రచయిత సుద్దాల అశోక్ తేజను బుధవారం రోజు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నేపథ్యంలో పుస్తకానికి బీజం పడిన కారణాలను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా రాసిన సాహితీ ప్రేమను ఆయనతో పంచుకున్నారు.విద్యార్థులు రాసిన కవితలను, సాహిత్యాన్ని పరిశీలించారు. విలువైన సూచనలను తెలియజేశారు. తొలిసారిగా రచనలను ప్రారంభించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలో అద్భుతంగా రాయడం సంతోషమని చెబుతూనే వారికి కొన్ని సూచనలను, పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యాబోధనతో పాటు సాహితీ ప్రేమికులుగా విద్యార్థులను ప్రోత్సహించడం తెలుగు విశ్వవిద్యాలయం గొప్పదనమని పేర్కొన్నారు.తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావును, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావును, జర్నలిజం విభాగాధిపతి ఆచార్య బిహెచ్. పద్మప్రియలకు అభినందనలు తెలిపారు. 7వ తరగతి చదువుతున్న సమయంలో తాను రాసిన ఓ పాటను ఉపాధ్యాయులు గుర్తించి, ప్రోత్సహించడం వల్లే తాను నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిస్తానని పేర్కొనడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.సుద్దాల అశోక్ తేజను కలిసిన వారిలో విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రేమాక్షరి రూపకర్త, రచయితలు కొండూరి కోటిబాబు, అంజిబాబు నాగుల, ఎస్.దాసు, సిరిపురం సునేహా తదితరులు పాల్గొన్నారు.