నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. ~ పిడిఎస్ యు. డిమాండ్.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎస్ యు. జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ లు మాట్లాడుతూ,
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు కళాశాలలు నడుస్తున్నాయన్నారు. సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్, ఒలంపియాడ్, టెక్,డీజీ లాంటి తోక పేర్లతో, ఐఐటి,నీట్, జేఈఈ లాంటివి ప్రోత్సహిస్తున్నామని మభ్యపెడుతూ, తల్లితండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్నారని తెలిపారు. జి.ఓ.నంబర్ 01,100, విద్య హక్కు చట్టం ఎక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. లక్షల రూపాయల ఫీజు తల్లితండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేయడం దారుణమన్నారు. డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ (డి ఎస్ ఆర్ సి) కమిటీ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఫీజులను ఎందుకు నియంత్రించట్లేదన్నారు. గుర్తింపు లేని పాఠశాలను మూసి వేయించాలని కోరారు. నిజామాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బ్రిలియంట్ హై స్కూల్, కారుణ్య హై స్కూల్, వీటితో పాటు కనీసం పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. భవనానికి కూడా పర్మిషన్ లేకుండా ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ , నారాయణ సీబీఎస్ఈ లాంటి వారు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్న మొక్కుబడిగా నోటీసులు మాత్రమే పంపించడం దుర్మార్గమన్నారు. వెంటనే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని పాఠశాలలు ఒక పేరు మీద గుర్తింపు పొంది, మరొక పేరు మీద పాఠశాలలలు నడుస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల పూర్తి వివరాలు, వాటి ఫీజులను బహిర్గత పరిచి తల్లితండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు. జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.నజీర్, జీ. నితిన్, సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు రేహాన్, మహేందర్, మున్నా అరవింద్,అయాన్ తదితరులు పాల్గొన్నారు.