బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భాస్కర చారి అదుపులోకి.. లంచం ఆరోపణ
గంటల తరబడి విచారణ
బోధన్ పట్టణంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడులు తీవ్ర కలకలం రేపాయి. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) భాస్కర చారిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది..
లంచం స్వీకరణకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా ఎసిబి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం ఎస్ఐ భాస్కర చారిని బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే అధికారులు పలుమార్లు ప్రశ్నిస్తూ కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం మొత్తం, ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించిన పలు పత్రాలు, సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో బోధన్ పట్టణంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, పోలీసు వ్యవస్థలో అవినీతి ఆరోపణలు మరోసారి వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
ఎసిబి అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.