• ఎమ్మెల్యే కోరం కనకయ్య నాయకత్వంలోనే మా ప్రయాణం: మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర స్పష్టీకరణ
• మా మధ్య విభేదాలు లేవు.. అంతా కుట్రదారుల తప్పుడు ప్రచారమే
• కనకయ్య తో ఉన్నది కుటుంబ అనుబంధం.. కమీషన్లు, కుట్రల ఆటలు సాగవు
• ఆ ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కనకయ్య ఆశీస్సులు మాకున్నాయి: దొడ్డ కిరణ్ మిత్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు పట్టణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలపై మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర మరియు ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొడ్డ డానియల్ తీవ్రంగా స్పందించారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య కి, తమకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను వారు పూర్తిగా ఖండించారు.
ఈ మేరకు మంగళవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలోని చైర్‌పర్సన్ ఛాంబర్‌లో ఒక ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. కొందరు రాజకీయ స్వార్థపరులు, కుట్రదారులు సోషల్ మీడియా మరియు ఇతర వేదికల ద్వారా కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ డానియల్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోరం కనకయ్య తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1998 సంవత్సరం నుండి, అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యే తో తమకు రాజకీయ సంబంధమే కాకుండా అంతకు మించిన కుటుంబ అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాను యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) విద్యార్థి విభాగం రోజుల నుంచే కోరం కనకయ్య అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన నాయకత్వంలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశానని డానియల్ వివరించారు. నాటి నుండి నేటి వరకు కనకయ్య పట్ల తమకున్న విధేయత మారలేదని, మున్ముందు కూడా మారబోదని స్పష్టం చేశారు.
గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించానని, తన బృందంతో కలిసి అహర్నిశలు శ్రమించానని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి, కోరం కనకయ్య భారీ విజయానికి తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తన భార్య కిరణ్ మిత్ర ఇల్లందు మున్సిపల్ చైర్‌పర్సన్ కావడం వెనుక ఏకైక కారణం ఎమ్మెల్యే కోరం కనకయ్య కి తమపై ఉన్న సంపూర్ణ విశ్వాసం, సహకారమేనని డానియల్ కొనియాడారు. అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన నాయకుడితో తమకు విభేదాలు ఉంటాయనడం కేవలం కుట్రదారుల భ్రమ మాత్రమేనని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కి తెలియకుండా తాము ఇల్లందు పట్టణంలో ఎలాంటి అధికారిక లేదా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదని, ఇకపై కూడా నిర్వహించబోమని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి అడుగు ఆయన సూచనలు మరియు ఆదేశాల మేరకే జరుగుతుందని తేల్చి చెప్పారు.
ఇటీవల పట్టణంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూతన వెజిటబుల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల ప్రకారమే జరిగిందన్నారు. అయితే, దానిని కూడా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి, తమ మధ్య చిచ్చు పెట్టేలా ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ మాట్లాడుతూ, గౌరవ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులు, ముఖ్యంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య సంపూర్ణ తోడ్పాటు వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రాణం ఉన్నంత వరకు నిలబెట్టుకుంటామని చెప్పారు.
తాము, తమ కుటుంబ సభ్యులు మరియు తమ వెంట నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఎల్లప్పుడూ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి నాయకత్వంలోనే కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి, ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన సారథ్యంలోనే ముందుకు సాగుతామన్నారు.
తమ తదుపరి లక్ష్యం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోరం కనకయ్య ని మరింత భారీ మెజారిటీతో గెలిపించి, నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టడమేనని, ఆ దిశగా తామంతా సమిష్టిగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు సృష్టించాలనుకునే వారి ఆటలు ఇల్లందులో సాగవన్నారు.
పార్టీ శ్రేణుల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడానికి కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న ఈ అసత్య ప్రచారాలను ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, ఎమ్మెల్యే కోరం కనకయ్య అండదండలు తమకు ఎల్లప్పుడూ శ్రీరామరక్ష అని చైర్‌పర్సన్ దంపతులు స్పష్టం చేశారు.