JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 2:49 pm Posted by : JANA SANGARSHANA

డ్వాక్రా సంఘంలో నకిలీ సంతకాల కలకలం: సభ్యులకు తెలియకుండానే ‘రూ. లక్ష’ లోన్ స్వాహా

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గంగారం తండాలో డ్వాక్రా మహిళా సంఘంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. గ్రామానికి చెందిన ‘పుష్ప’ మహిళా పొదుపు సంఘం సభ్యుల అనుమతి లేకుండా, వారి నకిలీ సంతకాలను ఫోర్జరీ చేసి రూ. లక్ష రుణాన్ని మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత పదేళ్లుగా పది మంది సభ్యులతో క్రమశిక్షణగా నడుస్తున్న ఈ గ్రూప్‌లో.. సెకండ్ లీడర్, బుక్ కీపర్ (VOA) సహకారంతో సభ్యులెవరికీ తెలియకుండా నకిలీ తీర్మానాలు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. తీరా రుణం మంజూరైన తర్వాత బ్యాంకు అధికారులు సభ్యులందరినీ రమ్మనడంతో ఈ దారుణం శుక్రవారం విలేకరుల సమావేశంలో బయటపడింది.

మొదట ఫస్ట్ లీడర్‌ను మచ్చిక చేసుకుని ఈ వ్యవహారాన్ని నొక్కేయాలని చూసినప్పటికీ, ఆమె మిగిలిన సభ్యులందరికీ సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సెకండ్ లీడర్‌ను నిలదీయగా.. తానేం తప్పు చేయలేదని, ఏపీఎం సూచనల మేరకే ఈ రుణం తీసుకున్నానని సమాధానమివ్వడం గమనార్హం. అంతేకాకుండా, సంఘ తీర్మానాల పుస్తకంలోని 7, 8వ పేజీలను సైతం చింపేయడం ఈ అక్రమాలకు బలమైన సాక్ష్యంగా మారుతోందని, దీని వెనుక పెద్ద స్కామే ఉందని సభ్యులు ఆరోపిస్తున్నారు.

తమ అనుమతి లేకుండా సంతకాలు ఫోర్జరీ చేయడం తీవ్ర నేరమని పేర్కొన్న సభ్యులు, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెకండ్ లీడర్‌తో పాటు సంబంధిత అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై మండల ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు వివరణ ఇస్తూ.. తమకు కూడా ఈ వ్యవహారంపై సమాచారం అందిందని, సభ్యుల అనుమతి లేకుండా ఫోర్జరీ సంతకాలతో లోన్ పొంది ఉంటే గనుక సంబంధిత వివోఏ (VOA) పై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.