భద్రాచలం పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ పి. శ్యాం ప్రసాద్ తన సిబ్బందితో కలిసి గోదావరి కరకట్ట, రెడ్డి సత్రం సమీప ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన సదరు వ్యక్తులను సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని విచారించారు.
విచారణలో వారి పేర్లు వాడపర్తి సురేష్, షేక్ షఫీర్ పాషా అలియాస్ సప్పుగా తేలింది. వీరిద్దరూ భద్రాచలం ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్న వీరు, భద్రాచలం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వినియోగదారులకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు.
నిందితుల వద్ద నుండి సుమారు 45,000/- రూపాయల విలువైన ఒక కేజీ గంజాయితో పాటు, ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులపై భద్రాచలం పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ బి. రామకృష్ణ కేసు నమోదు చేసి, తదుపరి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా భద్రాచలం డిఎస్పీ గారు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో స్థానిక యువత ఎక్కువగా గంజాయి రవాణాకు, వ్యసనాలకు బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు. గంజాయి రవాణా, విక్రయాలు మరియు నిల్వకు సంబంధించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని డిఎస్పీ స్పష్టం చేశారు.