నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువు కట్ట ప్రాంతం ప్రస్తుతం పేకాట రాయుళ్లకు ప్రధాన అడ్డాలా మారింది. కొంతమంది నిర్వాహకులు ముఠాగా ఏర్పడి ఇక్కడ ప్రతిరోజు అత్యంత భారీ స్థాయిలో పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం రాత్రి వేళల్లో మాత్రమే రహస్యంగా సాగిన ఈ అక్రమ దందా, ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పగటిపూట కూడా జోరుగా కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ బహిరంగ పేకాట స్థావరాల వల్ల గ్రామంలోని యువత, కూలీలు జూదానికి బానిసలై ఆర్థికంగా సర్వస్వం కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం పెరిగిపోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక పోలీస్, ఉన్నతాధికారులు స్పందించి, ఈ పేకాట కేంద్రాలపై తక్షణమే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని రుద్రూర్ ప్రజలు గట్టిగా కోరుతున్నారు.