JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:48 pm Posted by : JANA SANGARSHANA

ఇల్లందులో 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఘనతే: హరిప్రియ నాయక్.

♦ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

♦ అహర్నిశలు పాటుపడే డాక్టర్లు తెల్లకోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్ళు

♦ ఆనాడే ఇల్లందుకు టిపా స్కానింగ్, ఆపరేషన్ థియేటర్ సాధించాం

♦ కాంగ్రెస్ పాలనలో అందని ద్రాక్షగా మారిన ప్రజారోగ్యం

రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ ఇల్లందు మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ జాతీయ వైద్యుల దినోత్సవ (National Doctors’ Day) శుభాకాంక్షలు తెలియజేశారు. ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న వైద్యుల సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (డా. బి.సి. రాయ్) జయంతి, వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 1న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని వివరించారు. ఒకే తేదీన (జూలై 1, 1882 – జూలై 1, 1962) జననం, మరణం పొందిన ఆయన సేవలకు గుర్తుగా 1961లో ‘భారతరత్న’ లభించిందని, వారిని స్ఫూర్తిగా తీసుకుని వైద్యులు సేవ చేయాలని కోరారు.

‘వైద్యో నారాయణో హరిః’ అన్న సూక్తి ప్రకారం డాక్టర్లు తెల్లకోటు వేసుకున్న ప్రత్యక్ష దేవుళ్లని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేశామని, గులాబీ ప్రభుత్వ హయాంలోనే ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌గా రూపాంతరం చెందించామని ఆమె గుర్తు చేశారు.

గతంలో ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని గర్భిణీ స్త్రీలు పడుతున్న అవస్థలను తాను స్వయంగా గుర్తించానని బానోత్ హరిప్రియ నాయక్ తెలిపారు. ఈ సమస్యను ఆనాటి సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లి, ఇల్లందులోనే టిపా (TIFFA) స్కానింగ్‌తో పాటు అత్యవసర ప్రసవ సేవలు అందించేలా ప్రత్యేక ఆపరేషన్ థియేటర్‌ను, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయించగలిగామని చెప్పారు.

అదేవిధంగా ఇల్లందు ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు పడేవారని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రజా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను చేరవేసి, ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయించి రోగుల ప్రాణాలను కాపాడామని స్పష్టం చేశారు.

ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలనే సత్సంకల్పంతో తాను ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు బానోత్ హరిప్రియ నాయక్ వివరించారు. ఆనాడు కేసీఆర్, హరీష్ రావు గార్లతో సుదీర్ఘంగా చర్చించి ఇల్లందు నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన 100 పడకల (100 Beds) ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మంజూరు చేయించామని ఆమె సగర్వంగా గుర్తుచేశారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రజల ఇళ్ల ముంగిటకే వచ్చిన వైద్య సేవలు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలకు అందని ద్రాక్షగా మారాయని బానోత్ హరిప్రియ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, ఆసుపత్రుల్లో కనీస వసతులు కరువయ్యాయని ఆమె విమర్శించారు.

ప్రజల సంక్షేమం మరియు ఆరోగ్యం కోసం నిజాయితీగా పాటుపడేది కేవలం తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని బానోత్ హరిప్రియ నాయక్ స్పష్టం చేశారు. వైద్యరంగంలో ఉన్నవారంతా తమ నిరంతర సేవా సహకారాన్ని ప్రజలకు ఎల్లప్పుడూ అందించాలని ఆకాంక్షిస్తూ, నియోజకవర్గ వైద్యులందరికీ మరోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.