JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 2:37 pm Posted by : JANA SANGARSHANA

డబ్ల్యూ జె ఐ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్‌గా హనుమాండ్ల రామకృష్ణారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.. కో-కన్వీనర్‌గా కొండి సాయి కిరణ్

♦ మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ఆడ్హాక్ కమిటీ ఏకగ్రీవం

వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నూతన ఆడ్హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. గురువారం రాత్రి మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వివేకానంద బీఈడీ కళాశాల ప్రాంగణంలో మండల, గ్రామీణ విలేకరుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది. అందరి అంగీకారంతో సీనియర్, అనుభవజ్ఞులైన పాత్రికేయులు హనుమాండ్ల రామకృష్ణ రెడ్డిని జిల్లా ఆడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా మాట్లాడుతూ, జర్నలిజం అనేది కేవలం వార్తలను చేరవేసే వృత్తి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన సేవ అని కొనియాడారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (AI), సోషల్ మీడియా విస్తరణతో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ మారుతున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తూనే, తమ వ్యక్తిగత అధ్యయనం, విశ్లేషణా సామర్థ్యం, వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్) మరియు నైతిక విలువలను మరింత బలోపేతం చేసుకోవాలని రజ్జు భయ్యా సూచించారు. “ఏఐ ఒక సాధనం మాత్రమే, అది ఎప్పటికీ జర్నలిస్టు స్థానాన్ని భర్తీ చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు. నిజాన్ని వెలికితీయడం, సమాజ ప్రయోజనాలను కాపాడడం, ప్రజల గొంతుకగా నిలవడం జర్నలిస్టుల ప్రత్యేక బాధ్యతలని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంత విలేకరుల సంక్షేమం, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మరియు సంక్షేమ పథకాల అమలు కోసం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా నిరంతరం ప్రభుత్వంతో, యాజమాన్యాలతో సమన్వయం చేస్తూ పోరాటం కొనసాగిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరిగే దాడులను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

📢 కో-కన్వీనర్ కొండి సాయి కిరణ్ :

“ఈ నూతన కమిటీలో కో-కన్వీనర్‌గా ఎన్నికైన కొండి సాయి కిరణ్ మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామీణ విలేకరుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి కట్టుబడి ఉంటామని, అందరినీ కలుపుకొని సంఘ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.”