JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 6:23 pm Posted by : JANA SANGARSHANA

నిజాయితీ చాటుకున్న భద్రాచలం ఎంపీడీఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ వినోద్

♦ రాములవారి సన్నిధిలో పోయిన ఫోన్.. సురక్షితంగా అప్పగించిన పొడకలపల్లి వినోద్

♦ ఇల్లెందు వాసుల చరవాణి లభ్యం: కంప్యూటర్ ఆపరేటర్ వినోద్ మానవత్వం

♦ ఫోన్ దొరకగానే ఫోన్ చేసి పిలిచి ఇచ్చిన భద్రాచలం ఎంపీడీఓ ఆఫీస్ ఉద్యోగి వినోద్

నేటి సమాజంలో విలువలు మృగ్యమౌతున్న వేళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన నిజాయితీని చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. భద్రాచలం ఎంపీడీఓ (MPDO) కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పొడకలపల్లి వినోద్, దారిలో దొరికిన ఒక విలువైన చరవాణి (మొబైల్ ఫోన్) ని దాన్ని పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అప్పగించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇల్లెందు పట్టణానికి చెందిన గడ్డం పూజిత, ఆమె భర్త ధర్మరాజుల శ్రీకాంత్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు రాములవారి దర్శనాన్ని ముగించుకొని తిరిగి తమ స్వగ్రామమైన ఇల్లెందుకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ సమీపంలోకి రాగానే వారు తమకు సంబంధించిన విలువైన మొబైల్ ఫోన్‌ను ప్రమాదవశాత్తు జారవిడుచుకున్నారు.

అదే సమయంలో భద్రాచలం ఎంపీడీఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ పొడకలపల్లి వినోద్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఫోటోలు తీసే విధుల్లో భాగంగా ఆ మార్గంలో వెళ్తున్నారు. దారి మధ్యలో సుభాష్ నగర్ కాలనీ నందు ఆయనకు ఈ మొబైల్ ఫోన్ దొరికింది. ఫోన్ దొరకగానే వినోద్ చుట్టుపక్కల వారిని ఎవరినైనా అడిగి చూశారు, కానీ ఆ ఫోన్ ఎవరిదీ కాదని వారు చెప్పడంతో దాన్ని తన వద్దే భద్రంగా ఉంచుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఫోన్ పోగొట్టుకున్న బాధితురాలు గడ్డం పూజిత తీవ్ర ఆందోళనతో తన నంబర్‌కు వేరే ఫోన్ నుండి కాల్ చేశారు. వెంటనే స్పందించిన వినోద్.. “మీ ఫోన్ నా వద్ద భద్రంగా ఉంది, నేను భద్రాచలంలోనే ఉన్నాను.. మీరు వచ్చి మీ ఫోన్‌ను తీసుకెళ్లవచ్చు” అని వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకున్న దంపతులు వినోద్ ఉన్న చోటుకు చేరుకున్నారు.

బాధితులు శ్రీకాంత్, పూజితలు అక్కడికి చేరుకున్నాక వినోద్ వారి వివరాలను సరిచూసి, మొబైల్ ఫోన్‌ను సురక్షితంగా తిరిగి వారి చేతికి అప్పగించారు. రాములవారి సన్నిధికి వచ్చి ఫోన్ పోగొట్టుకొని దిగులు పడుతున్న తమకు, వినోద్ రూపంలో ఫోన్ తిరిగి దక్కడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వినోద్ చూపిన అసాధారణ నిజాయితీకి ఇల్లెందు దంపతులతో పాటు స్థానికులు ఆయనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.