భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం, ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఇల్లెందు పట్టణ, మండల పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు, జిల్లా సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జె.కె.కాలనీ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ముందు విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిలివేరి సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ మరియు యువజన నాయకులు గిన్నారపు రాజేష్ మాట్లాడుతూ… విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం అమానుషమని, అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును కాలరాయడం సరికాదని, విద్యార్థుల పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యార్థులకు సంఘీభావంగా కేటీఆర్ గారు తన 50వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజల, విద్యార్థుల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
అనంతరం, నియోజకవర్గ కార్యాలయంలో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉద్యమ నాయకులు దేవిలాల్ నాయక్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, మహిళలు మరియు యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.