JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 1:52 pm Posted by : JANA SANGARSHANA

ప్రేమ పేరుతో మోసం చేస్తే ఊరుకునేది లేదు.. బాధితురాలికి న్యాయం చేయాలి!

ప్రేమ పేరుతో మోసం చేస్తే ఊరుకునేది లేదు.. బాధితురాలికి న్యాయం చేయాలి!

 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం.. గర్భసంచి ట్యూబులు దీనికి ముఖ్య సూత్రధారులు వైద్యుడు ఆర్ఎంపీ డాక్టర్ ఇలియాస్ తొలగించారని మహిళ సంచలన ఆరోపణలు.

ఫిర్యాదు చేసినా అరెస్ట్ ఎందుకు చేయలేదు? పోలీసుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం.

బాధితురాలి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

బోధన్, జూలై 27 (జన సంఘర్షణ):

ప్రేమ పేరుతో ఓ మహిళను నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి సంవత్సరాల తరబడి సహజీవనం చేసి, అనంతరం పెళ్లికి నిరాకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బోధన్ పట్టణంలోని ఉషోదయ కాలేజీ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ సిమా తనకు జరిగిన అన్యాయంపై మీడియా ద్వారా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు పదేళ్ల క్రితం పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన, ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌గా ఉన్న దస్తాగిర్‌తో తనకు ప్రేమ పరిచయం ఏర్పడిందని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనంతరం వివాహానికి నిరాకరించడంతో తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారని చెప్పారు.

అయితే దస్తాగిర్ తన మొదటి భర్తను సంప్రదించి తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని చెప్పడంతో కుటుంబంలో విభేదాలు ఏర్పడి చివరకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. అనంతరం తల్లిదండ్రులు మరోసారి వివాహం చేసినప్పటికీ, రెండో భర్త వద్ద కూడా ఇదే విధంగా మాట్లాడి విడాకులు తీసుకునే పరిస్థితి కల్పించాడని ఆమె పేర్కొన్నారు.

విడాకుల అనంతరం తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి బోధన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని సుమారు ఆరు సంవత్సరాలుగా తనతో సహజీవనం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో తాను గర్భవతి కావడంతో గర్భస్రావం చేయించడమే కాకుండా, తన అనుమతి లేకుండానే గర్భసంచికి సంబంధించిన ట్యూబులను తొలగించే శస్త్రచికిత్స చేయించారని ఆరోపించారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా నిరాకరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో దస్తాగిర్‌తో పాటు తనకు వైద్యం చేసిన ఆర్‌ఎస్‌పీ ఆస్పత్రి వైద్యుడిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన స్పందన లేదని ఆమె తెలిపారు.

ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు ఎప్పుడు?

బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే కేసు నమోదైనప్పటికీ అరెస్టు జరగకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాధితురాలి ఆరోపణలు నిజమైతే ఇంత తీవ్రమైన ఆరోపణలను అధికారులు తేలిగ్గా తీసుకోకుండా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

“ప్రేమ పేరుతో మహిళలను మోసం చేసి, పెళ్లి హామీలతో వారి జీవితాలతో చెలగాటమాడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరించాలి. బాధితురాలికి న్యాయం జరిగేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదు నమోదైన తర్వాత కూడా నిందితుడిని అరెస్టు చేయకపోవడానికి కారణమేంటి? దర్యాప్తు పేరుతో జాప్యం చేస్తే బాధితురాలికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

బాధితురాలి ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల పూర్తి స్పందన వెలువడాల్సి ఉంది. ఆరోపణలు దర్యాప్తులో నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వైద్యపరమైన ఆరోపణలపై సంబంధిత వైద్య అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి, బాధితురాలికి న్యాయం జరిగేలా పారదర్శక దర్యాప్తు చేపట్టాలని, చట్టపరమైన ఆధారాలు ఉంటే నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.