JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 6:56 pm Posted by : JANA SANGARSHANA

బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ నేతృత్వంలో మండల సమావేశం

♦ భద్రాచలంలో బీజేపీ మండల కార్యవర్గ భేటీ

♦ బెల్ట్ షాపులు, గంజాయి నియంత్రణే లక్ష్యం

♦ ఏరియా ఆసుపత్రి సమస్యలపై విచారణకు డిమాండ్

భద్రాచలం, జూలై 5: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాల ఆదేశాల మేరకు భద్రాచలంలో మండల కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. స్థానిక బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశానికి బీజేపీ భద్రాచలం మండల ఇంచార్జి తాటి పాముల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోరాడాల్సిన ఆవశ్యకతను ఆయన ఈ సందర్భంగా క్యాడర్‌కు వివరించారు.

సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుంజా ధర్మా మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తున్న బెల్ట్ షాపుల నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు. ఈ విషయంలో భద్రాచలం గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దానిని వంద శాతం పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కోరారు.

అదేవిధంగా, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న నిర్లక్ష్య, వివాదాస్పద సంఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. వైద్యుల సంఖ్యను తక్షణమే పెంచి, ప్రజలకు 24 గంటలపాటు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టణంలో యువతను పాడుచేస్తున్న గంజాయి రవాణాపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీసు శాఖను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. అయితే కేవలం సరిహద్దుల్లోనే కాకుండా, భద్రాచలం పట్టణంలోని అంతర్గత కాలనీల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ముఖ్యమైన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక గిరిజన ప్రాంతాల సమస్యలను, పార్టీ పరంగా చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలను ఆయన ఇతర నాయకులతో చర్చించారు. భద్రాచలం మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ములిశెట్టి రాంమోహన్ రావు కూడా ఈ భేటీలో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముత్యాల చంద్రశేఖర్, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల సుబ్బారావు, పి.సి. కేశవ్, అల్లాడి వెంకట సుబ్బారావు, శేర్ శ్రీనివాస్, కనసాని శ్రీనివాస్, జంపాల ప్రభాకర్, గుమ్మల వెంకటేశ్వర్లు, కె. సంధ్య, గార్లపాటి శ్రీను, మండల గురుసాయి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.