♦ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మానవాళికే ప్రమాదం: రోటరీక్లబ్ అధ్యక్షులు
♦ పుడమితల్లికి పచ్చటి పందిరి వేయడమే రోటరీక్లబ్ లక్ష్యం: దూదికట్ల సత్యం
ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహబూబాబాద్ రోటరిక్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. రోటరీక్లబ్ అధ్యక్షులు దూదికట్ల సత్యం అధ్యక్షతన ఈ పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా రోటరీక్లబ్ అధ్యక్షులు దూదికట్ల సత్యం మాట్లాడుతూ.. పుడమితల్లికి పచ్చటి పందిరి వెయ్యాలనే ఒకే ఒక ఉదాత్తమైన లక్ష్యంతో ఈరోజు పాఠశాల ప్రాంగణంలో వందకు పైగా మొక్కలను నాటామని తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ షెడ్యూల్ ప్రకారమే బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత రోజుల్లో అడవుల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతింటోందని దూదికట్ల సత్యం వాపోయారు. తద్వారా ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర అసంబద్ద మార్పులు వచ్చాయని, మన దేశంలో వర్షాభావ పరిస్థితులు, యూరప్ ఖండంలో వేడి గాలులు, ఆఫ్రికా దేశాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని విచారం వ్యక్తంచేశారు.
ఆకస్మిక వరదలు, భూకంపాలతో మానవాళిపై ప్రకృతి కన్నెర్ర చేస్తోందని, వైజ్ఞానికంగా మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పారిశ్రామికీకరణ కారణంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆయన ఆవేదన చెందారు. రాబోయే రోజుల్లో ధృవాల వద్ద మంచు కరిగి ఎన్నో ప్రసిద్ధ నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలని, ఆ దిశగానే మహబూబాబాద్ రోటరీక్లబ్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కేవలం సంస్థలే కాకుండా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు సైతం ఈ పర్యావరణ మహాయజ్ఞంలో భాగస్వాములై తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ఈ మహత్తర కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రధానకార్యదర్శి శంతన్ రామరాజు, కోశాధికారి ముల్లంగి మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ లీడర్ బిక్కి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే సీనియర్ రొటేరియన్లు బొల్లం శ్రీనివాస్, బోనగిరి గిరిధర్ గుప్తా, సాధు మహిపాల్ రెడ్డి, అచ్చ శ్రీనివాస్, జిల్లా పదోతరగతి ఎగ్జామినేషన్ ఆఫీసర్ మందుల శ్రీరాములు, మోడల్ స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు, ఉపాధ్యాయిని కీర్తన మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.