♦ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా: శంతన్ రామరాజు
♦ రంగా పోరాట జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
♦ ప్రజల కోసం ప్రాణాలర్పించిన ప్రశ్నించే గొంతుక వంగవీటి రంగా
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు కొనియాడారు. శనివారం నాడు మానుకోటలోని శ్రీరాం నగర్ బీసీ కాలనీలో వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శంతన్ రామరాజు మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగా అంటేనే అన్యాయాన్ని ప్రశ్నించే ఒక గొప్ప గొంతుక అని అభివర్ణించారు. 1947 జూలై 4న బెజవాడలో జన్మించిన రంగా, నాటి నుండి తన జీవితాంతం పేద ప్రజల సంక్షేమం కోసమే అంకితం చేశారని, వారి హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు.
సమాజంలో వెనుకబడిన కార్మిక వర్గాలన్నింటినీ ఏకం చేసి, వారికి జరుగుతున్న అన్యాయాలపై రంగా సింహస్వప్నమై నిలిచారని రామరాజు పేర్కొన్నారు. 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన రంగా, తాను కలలుగన్న నవ సమాజ నిర్మాణం కోసం మరియు అణగారిన వర్గాల ఉన్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.
ఈ క్రమంలోనే రంగాకు ప్రజల్లో వస్తున్న ఆదరణను, ఆయన ఎదుగుదలను ఓర్వలేని నాటి పాలకులు తీవ్ర అభద్రతాభావానికి లోనయ్యారని విమర్శించారు. ఎలాగైనా ఆయన అడ్డు తొలగించుకోవాలని కుట్రలు పన్నారని, అందులో భాగంగానే ప్రజల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రంగాను బాంబుదాడితో అత్యంత పాశవికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
భౌతికంగా రంగాను మనకు దూరం చేసినంత మాత్రాన ఆయన చూపిన పోరాటస్ఫూర్తిని ప్రజా బాహుళ్యం నుండి ఎవరూ చెరిపివేయలేరని శంతన్ రామరాజు స్పష్టం చేశారు. నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో రంగా సజీవంగా ఉన్నారని, అలాంటి మహనీయుడి జీవిత చరిత్రను రాబోయే తరాల కోసం పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు వేల్పుల లక్ష్మణ్ పటేల్, వేల్పుల శోభన్ బాబు పటేల్, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరమళ్ళ ప్రేమ్ రాయుడు పటేల్, కోరే ప్రసాద్ పటేల్ తదితర ముఖ్య నాయకులు, కాలనీ ప్రజలు మరియు రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.