JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 12:59 pm Posted by : JANA SANGARSHANA

రుద్రూర్ పోలీసుల తనిఖీల్లో 5 కిలోల గంజాయి పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్ట్.. రెండు బైకులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

రుద్రూర్ పోలీసుల తనిఖీల్లో 5 కిలోల గంజాయి పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్ట్.. రెండు బైకులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

రుద్రూర్, జూలై 27, (జనసంఘర్షణ): రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 26న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు రుద్రూర్ పోలీసులు అంబం రోడ్డు వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వాహనాల పెట్రోల్ ట్యాంక్ కవర్లలో ప్లాస్టిక్ కవర్లలో దాచిన గంజాయిని గుర్తించారు. ఒకరి వద్ద 3 కిలోలు, మరొకరి వద్ద 2 కిలోలు.. మొత్తం 5 కిలోల గంజాయి లభించింది.

అరెస్టయిన నిందితులను బీహార్ రాష్ట్రానికి చెందిన బల్వంత్ కుమార్ సింగ్ (37), కోటగిరి మండలంలోని వినాయక్ నగర్‌కు చెందిన కర్కెల్లి సంజీవ్ (37) గా పోలీసులు గుర్తించారు.

విచారణలో బల్వంత్ కుమార్ సింగ్ కొంతకాలంగా కామాకి రైస్ మిల్లులో పనిచేస్తున్నట్లు, సుమారు మూడు సంవత్సరాల క్రితం కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్లులో పనిచేస్తున్న కర్కెల్లి సంజీవ్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కలిసి రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలకు గంజాయి విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. బల్వంత్ కుమార్ సింగ్ బీహార్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకువచ్చి, సంజీవ్‌తో కలిసి రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విధంగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకునేవారని పోలీసులు తెలిపారు.

జూలై 26న గంజాయిని విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయి సరఫరా చేసిన బీహార్‌కు చెందిన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా, వీరి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఏడుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

 

ఈ కేసు దర్యాప్తులో సహకరించిన ఏసీపీ సీసీఎస్, చీట్ ఫోర్స్, ఏసీపీ బోధన్, రుద్రూర్ సీఐతో పాటు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

నిషేధిత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ బోధన్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.