♦ ఏజెన్సీ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
♦ ఆశ్రమ పాఠశాలల అప్‌గ్రేడేషన్, పోడు భూముల పట్టాలపై వినతి
ఏజెన్సీ ప్రాంతాల్లోని శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధిపై ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఏజెన్సీ నియోజకవర్గానికి అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల ఉన్నత స్థాయి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంత సమస్యలపై సీఎంకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
ఏజెన్సీ ఏరియాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆదివాసీ ప్రాంతాల పోడు భూములకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని గిరిజన ప్రజాప్రతినిధుల బృందం ముఖ్యమంత్రిని కోరింది. దీనివల్ల ఎంతోమంది గిరిజన రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
గిరిజన ప్రాంతాలలో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు మరియు సాగునీటి వసతులను పెంపొందించేందుకు ‘ఇందిర గిరి జల వికాసం’ పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.
గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచే ఐటీడీఏ (ITDA)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు వేగంగా అందేలా చూడాలన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు. దీనివల్ల గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా స్థానికంగానే చదువుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) ఉన్నారు.
సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ కూడా పాల్గొని, ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.