♦ ఒకే ఆర్ఐపై రెండు ప్రాంతాల భారం.. స్తంభించిన రెవెన్యూ సేవలు
♦ ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, మహిళల నిరీక్షణ: ముద్రగడ వంశీ ఆవేదన
♦ వెంటనే ఆర్ఐ-2 పోస్టును భర్తీ చేయాలి: టిడిపి నాయకుడు ముద్రగడ వంశీ డిమాండ్
♦ టోకెన్ విధానం అమలు చేసి రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
ఆర్ఐల కొరతతో ఇల్లందు ప్రజలకు తప్పని తిప్పలు: ముద్రగడ వంశీ
ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్ఐ-1, ఆర్ఐ-2) విధులు నిర్వహించాల్సి ఉండగా, ఆర్ఐ-1 ఒక్కరిపైనే ఇల్లందు పట్టణం మరియు రూరల్ ప్రాంతాల బాధ్యతలు మోపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు.
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రోజువారీగా వచ్చే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందన్నారు. సదరు అధికారి ఉదయం పూట క్షేత్రస్థాయి విధుల్లో ఉండి, మధ్యాహ్నం లేట్ గా రావడంతో సేవలు స్తంభించిపోతున్నాయని పేర్కొన్నారు.
కళాశాల ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ దరఖాస్తులకు సమయానికి ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొందరు అధికారులు ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఆర్ఐ-2 పోస్టును వెంటనే భర్తీ చేయాలని, అంతవరకు తాత్కాలికంగా మరొక రెవెన్యూ అధికారిని అందుబాటులో ఉంచాలని ముద్రగడ వంశీ డిమాండ్ చేశారు.
ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక సమయాన్ని కేటాయించి, టోకెన్ విధానాన్ని అమలు చేయాలని, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు సకాలంలో రెవెన్యూ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.