♦ పాలనపై బిఆర్‌ఎస్ ‘సమరభేరి’: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
♦ సెప్టెంబర్ 2 నుంచి బిఆర్‌ఎస్ ‘సమరభేరి’.. విజయవంతం చేయాలని హరిప్రియ నాయక్ పిలుపు
♦ కెటిఆర్ పిలుపుతో కదం తొక్కనున్న బిఆర్‌ఎస్ శ్రేణులు: ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జ్ హరిప్రియ నాయక్
♦ ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బిఆర్‌ఎస్ నేతల ధ్వజం
బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ‘సమరభేరి’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి ఇల్లందు నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో దారుణంగా విఫలమైందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం కాలయాపన చేస్తోందని హరిప్రియ నాయక్ విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే ప్రస్తుత పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బిఆర్‌ఎస్ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సమరభేరి కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా దిగ్విజయం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు.
పట్టణ మరియు మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, ప్రతి ఇంటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, జిల్లా నాయకులు పి ఏ సి ఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, జిల్లా నాయకులు భూక్య దళ్ సింగ్, లకావత్ దేవిలాల్ నాయక్ పాల్గొని తమ సూచనలు చేశారు.
వారితో పాటు 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మసూద్ రబ్బు మరియు స్థానిక పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.