♦ ఇల్లందు అంగన్వాడీ కేంద్రంలో ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’ విజవంతం
♦ పుట్టిన గంటలోనే ముర్రుపాలు పట్టించాలి.. అదే బిడ్డకు శ్రీరామరక్ష
♦ బాలామృతం, చిక్కీలతో పిల్లల్లో పోషకాహార లోపానికి చెక్
♦ అంగన్వాడీ సేవలపై ఇల్లందులో అవగాహన సదస్సు
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక మరియు శారీరక ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని ఇల్లందు 22వ వార్డ్ కౌన్సిలర్ కోర్లపాటి శివకిరణ్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఇల్లందు పట్టణంలోని వినోబాభావే కాలనీ అంగన్వాడి కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లి ముర్రుపాలు తాగించాలని సూచించారు. ఈ ముర్రుపాలను ‘లిక్విడ్ గోల్డ్’ అని పిలుస్తారని, ఇందులో ఉండే రోగనిరోధక శక్తి బిడ్డకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇవి పసిపిల్లల్లో ఇన్ఫెక్షన్లు, విరేచనాలు రాకుండా కాపాడుతాయని వివరించారు.
పుట్టిన నాటి నుండి మొదటి 6 నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు సరైన అనుబంధ ఆహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. దీనివల్ల పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉంటుందన్నారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న బాలామృతం, చిక్కీల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. ఈ చిక్కీలలో ఐరన్, ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్-ఏ, విటమిన్-బి1 పుష్కలంగా ఉంటాయని, వీటి వల్ల పిల్లల్లో రక్తహీనత, బలహీనత తగ్గి, బరువు మరియు ఎత్తు సరిగ్గా పెరుగుతారని తెలిపారు.
గర్భిణులు, బాలింతల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి నెలా ప్రతి గర్భిణి, బాలింతకు 16 గుడ్లు ఉచితంగా ఇస్తున్నామని, అలాగే బుధ, శుక్రవారాల్లో ఆకుకూరలతో కూడిన వేడి భోజనం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 3 నుంచి 5 ఏళ్ల పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించాలని కోరారు.
కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్‌ను పుష్పగుచ్చం, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మిట్ట గడుపుల యాకమ్మ, ఆలేటి సంధ్య, హెల్పర్ దేవులపల్లి సోమలక్ష్మి, ఆశా వర్కర్ సిహెచ్. రేణుక తదితరులు పాల్గొన్నారు.