JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:35 pm Posted by : JANA SANGARSHANA

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ఆచార్య జయశంకర్: ఇల్లందు తహసీల్దార్ షా ఖాసీం

♦ జయశంకర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలి: తహసీల్దార్ కార్యాలయంలో జయంతి వేడుకలు

♦ ఇల్లందులో ఘనంగా జయశంకర్ జయంతి ఉత్సవాలు

తెలంగాణ వైచారిక మార్గదర్శి జయశంకర్

ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షా ఖాసీం, జూనియర్ అసిస్టెంట్ వీరన్న మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం ధారపోసిన మహనీయుడి సేవలను ఈ సందర్భంగా కార్యాలయ వర్గాలు స్మరించుకున్నాయి.

జయశంకర్ సేవలను కొనియాడిన తహసీల్దార్

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షా ఖాసీం  మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రతి ఒక్కరి గుండెల్లో రగిలించిన గొప్ప మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగానికి ఎనలేని సేవలు అందించడమే కాకుండా, ఉద్యమానికి  బలమునందించిన మహోన్నత వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

ఆశయ సాధనకు పిలుపు

జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వీరన్నతో పాటు తహసీల్దార్ కార్యాలయ వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ సేవలను గుర్తుచేసుకున్నారు.