JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:50 pm Posted by : JANA SANGARSHANA

వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు – హైకోర్టు, సుప్రీం తీర్పులను అమలు చేయాలని డిమాండ్

ఆయుష్ పీజీ విద్యార్థుల నిరాహార దీక్షకు బీజేపీ పూర్తి మద్దతు – రేవంత్ ప్రభుత్వంపై  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ధ్వజం

♦ అల్లోపతితో సమానంగా ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలి: తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేసిన బీజేపీ

♦ 16 రోజులుగా విద్యార్థుల పోరాటం – పట్టించుకోని రేవంత్ రెడ్డి సర్కార్: రామచంద్రరావు ఆగ్రహం

♦ ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ ఆయుష్ పీజీ స్టైఫండ్‌ను పెంచాలి

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) అభ్యసిస్తున్న ఆయుర్వేదిక్, హోమియోపతి, ఆయుష్ (AYUSH) వైద్య విద్యార్థులకు గత కొన్ని సంవత్సరాలుగా అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్లను ప్రభుత్వాలు నిలిపివేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 2006లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.) ప్రకారం అల్లోపతి వైద్యులతో సమానంగా భారతీయ వైద్య విధానాల విద్యార్థులకు కూడా అన్ని ప్రయోజనాలు అందించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అమలు చేసిన ఈ నిబంధనలను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుండి ఇక్కడి ప్రభుత్వం ఆపివేసిందని విద్యార్థులు వాపోతున్నారు. నాటి నుండి తమకు రావాల్సిన న్యాయమైన స్టైఫండ్ అందుక తీవ్ర అసమానతలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యత్యాసాలపై గతంలో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, అల్లోపతి విద్యార్థులతో సమానంగా ఆయుష్ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్లు చెల్లించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ నాటి ప్రభుత్వం ఆ ఆదేశాలను సరైన రీతిలో అమలు చేయడంలో విఫలమైంది.

ప్రస్తుతం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ ఆయుష్ విద్యార్థులకు ₹60,000 వరకు స్టైఫండ్ ఇస్తుండగా, తెలంగాణలో మాత్రం విద్యార్థులకు రూ.30,000 మాత్రమే ఇస్తున్నారు. అలాగే అక్కడ రూ.25,000 వస్తుంటే, ఇక్కడ విద్యార్థులకు కేవలం రూ.13,000 మాత్రమే అందుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం మరియు పక్క రాష్ట్రంలో సమానంగా ఇస్తున్నప్పుడు, తెలంగాణలో ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారని విద్యార్థులు మరియు ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం కూడా ఈ సమస్యపై మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్లు ఇస్తున్నారో, అదే రీతిలో తెలంగాణలోనూ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయుష్ పీజీ విద్యార్థులు గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున నాయకుడు ఎన్వీఎస్‌ఎస్ రామచంద్రరావు నేరుగా కలిసి పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల పోరాటానికి బీజేపీ వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రామచంద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ కేవలం ల్యాండ్ మాఫియా, ఇతర వ్యాపార అంశాలపైనే దృష్టి పెడుతోందని, ప్రజా సేవ చేసే భావి వైద్యుల భవిష్యత్తును పూర్తిగా మర్చిపోతోందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి విద్యార్థులకు ఏ విధంగా అయితే సమానంగా స్కాలర్‌షిప్‌లు మరియు స్టైఫండ్లు ఇస్తున్నారో, తెలంగాణలో కూడా వెంటనే ఆయుష్ విద్యార్థులకు సమాన వేతనాలు, సదుపాయాలు కల్పించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.