హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 24, (జన సంఘర్షణ):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టలో ప్రభుత్వ భూములు దేవాలయ భూములను కాపాడాలని ఏషమైన మాధవులు మహేష్ కుమార్ నందగిరి సతీష్ నేతృత్వంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్న నాయకులకు పూలమాలవేసి వారితో కలిసి దీక్షలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ యువజన నాయకులు ఎర్ర వీరన్న మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పరిధిలోని సర్వే నంబర్ 348/1 లో గల భూములు అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన 20 సంవత్సరాలు అది ప్రభుత్వ భూమి లేక దేవాలయ భూమా అర్థం కాని వింత పరిస్థితిని సృష్టించారు. ఇదే ఆసరాగా చేసుకుని కబ్జాదారులు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాదారులు కలిసి సిండికేట్ గా మారి స్థానిక రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలను మభ్యపెట్టి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. వాస్తవంలో రెవెన్యూ రికార్డులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంచడం వలన కాలం గడిచిపోయింది సమస్య జటిలంగా మారింది. ఇప్పటికైనా తెలంగాణ హైకోర్టు wp/40409/2025లో10-04-2026 కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు 12 వారాలలో సర్వే చేసి హద్దులు నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రహదారులు నిర్మించి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారుల స్పందన శూన్యం ఎందుకు ఇలా అధికారులు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని వింత పరిస్థితి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారులు కబ్జాదారులతో కలిసిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మండల రెవెన్యూ అధికారులను చర్యలు తీసుకునేలా గట్టి ఆదేశాలు జారీ చేయాలని లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు రెవెన్యూ అధికారుల పనితీరుపై నిరసన తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్ టీం,జనసేన పార్టీ ముఖ్య నాయకులు, బిజెపి పార్టీ ప్రముఖ ముఖ్య నేతలు, స్థానిక యువకులు, సిపిఐ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.