* కింది స్థాయి సిబ్బంది సహకారంపై ఆరోపణలు
* ఫిర్యాదుల సమాచారం అక్రమ రవాణాదారులకు చేరుతోందా?
* చెక్‌పోస్టులు, రాత్రి పెట్రోలింగ్‌పై ప్రజల అనుమానాలు
* మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
కోటగిరి./సెప్టెంబర్ 16/(జనసంఘర్షణ)
పోతంగల్ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోందన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సుంకిని, కొడిచర్ల, పోతంగల్, హంగర్గ, కారేగాం తదితర ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సమయంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు కొనసాగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో పెట్రోలింగ్ వాహనాల సమీపం నుంచే ట్రాక్టర్లు వెళ్తున్నా చర్యలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.
ఫిర్యాదు చేస్తే మాఫియాకు సమాచారం?
గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తే, ఆ సమాచారం వెంటనే అక్రమ రవాణాదారులకు చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేలోపే ట్రాక్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ అంశాన్ని పోతంగల్ మండల కేంద్రంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఓ సర్పంచ్ బహిరంగంగా ప్రస్తావించినట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై తాము పోలీసులకు సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి విషయం తెలియజేస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నట్లు తెలిసింది.
చెక్‌పోస్టు ఉన్నా అక్రమ రవాణా ఎలా?
సుంకిని, కొడిచర్ల, పోతంగల్ ప్రాంతాల్లో మంజీరా నది నుంచి ఇసుక తరలించే మార్గాల్లో చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అక్రమ రవాణా ఎలా కొనసాగుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోతంగల్ మొదటి బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టు ఉన్నట్టా? లేనట్టా? అన్న రీతిలో ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిని దాటి రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా, బడేపాడ్ తదితర ప్రాంతాలకు అక్రమ ఇసుక ట్రాక్టర్లు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పోతంగల్ మండలం నుంచి బయలుదేరిన వాహనాలు ఇతర ప్రాంతాల్లో పట్టుబడుతున్నాయని స్థానికులు చెబుతూ, మధ్యలో ఉన్న తనిఖీ కేంద్రాల పనితీరుపై సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
ఒక్క ట్రాక్టర్‌కు రూ.500 రూ, మామూళ్ల చొప్పున ఆరోపణలు?
రాత్రి బీట్ విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు.
‘ట్రాక్టర్‌కు మామూలు చెల్లిస్తే దర్జాగా ఇసుక తరలించుకోవచ్చా?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఇతర ప్రాంతాల్లో పట్టుబడుతున్న వాహనాలపై ప్రశ్నలు
పోతంగల్ మండలం నుంచి తరలుతున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లు రుద్రూర్, వర్ని తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడుతున్నప్పటికీ, కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం అదే స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
జిల్లా పోలీస్ శాఖ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, పోతంగల్ మండలంలో రాత్రి వేళల్లో రవాణా కొనసాగుతోందన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
ఎస్సై వివర
ఈ ఆరోపణలపై కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌ను వివరణ కోరగా, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 20కి పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కోటగిరి పరిధి నుంచి తప్పించుకున్న వాహనాల సమాచారాన్ని రుద్రూర్, వర్ని పోలీసులకు అందించి పట్టుకుంటున్నామని పేర్కొన్నారు.
కానిస్టేబుళ్లు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, అక్రమ ఇసుక రవాణాకు ఎవరైనా సహకరించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై స్పష్టం చేశారు. ఆయా గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలించే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ రవాణాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.
ఉన్నతాధికారుల దృష్టి సారించాలి..!
మంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న ఆరోపణలు, ఫిర్యాదుల సమాచారం లీక్ అవుతోందన్న విమర్శలు, మామూళ్ల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ రవాణాపై కేవలం అప్పుడప్పుడు దాడులు నిర్వహించడం కాకుండా, రాత్రి వేళల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ సిబ్బంది విధులను పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంజీరా నది సహజ వనరులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ ఇసుక రవాణా ఎప్పటికి అడ్డుకట్ట పడుతుంది? చెక్‌పోస్టులు, రాత్రి పెట్రోలింగ్ ఉన్నప్పటికీ ట్రాక్టర్లు ఎలా రాకపోకలు సాగిస్తున్నాయి? అన్న ప్రశ్నలకు ఉన్నతాధికారుల చర్యలే సమాధానం చెప్పాల్సి ఉంది.