JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:20 am Posted by : JANA SANGARSHANA

అవాస్తవ ప్రచారాన్ని ఖండిస్తున్నాం, పొదెం వీరయ్య పై నిరాధార కథనాలు సరికాదు

 

* వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప శ్రీనివాసరావు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్లమండలం, సెప్టెంబర్ 29(జనసంఘర్షణ):

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పై ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార, వాస్తవాలకు విరుద్ధమైన కథనాలను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప శ్రీనివాసరావు తెలిపారు.

పొదెం వీరయ్య సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న సీనియర్ నాయకుడని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, గాంధీ కుటుంబ రాజకీయ భావజాలానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ములుగు నియోజకవర్గం నుంచి రెండుసార్లు, భద్రాచలం నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికై విశేష సేవలు అందించారని, ముఖ్యంగా 2018-2023 మధ్య పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా నిలిచి పార్టీని కాపాడిన వ్యక్తి పొదెం వీరయ్య ని, అలాంటి వ్యక్తిపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.“పొదెం వీరయ్య రాజకీయ ప్రస్థానాన్ని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను పక్కనపెట్టి, ఊహాగానాలు మరియు నిర్ధారణ లేని అంశాల ఆధారంగా కథనాలు ప్రచురించడం సరైన జర్నలిజం పద్ధతి కాదు”,అని ఇర్ప శ్రీనివాసరావు అన్నారు.

వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా, ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో పనిచేయడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురించడం మానుకోవాలని, నిరాధారమైన వార్తలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను పరిశీలించాలని ఆయన కోరారు.