జంగంపల్లి శివారులో ఘటన.. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు
భిక్కనూర్, సెప్టెంబర్ 13 (జనసంఘర్షణ): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఆదివారం ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను దివ్యవాణిగా గుర్తించారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
కాగా, రెండు రోజుల క్రితం దివ్యవాణి కనిపించకుండా పోయినట్లు ఆమె తండ్రి మధుసూదన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.