* ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాల్లో సహకార సంఘాల చైర్మన్ పదవులపై కసరత్తు.. 12 సొసైటీలకు పేర్లపై ఆసక్తికర చర్చ.!
పోత్తంగల్ ప్రతినిధి సెప్టెంబర్ 27 (జనసంఘర్షణ):
ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్ పదవులపై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిలో చైర్మన్లను నియమించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఆయా సొసైటీలకు చైర్మన్ల ఎంపికపై ఆసక్తి నెలకొంది.
బాన్సువాడ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాల పరిధిలోని సహకార సంఘాలకు సంబంధించి పలువురు నాయకుల పేర్లను పరిశీలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రస్తుత మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పేర్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పలు సొసైటీలకు ప్రతిపాదిత పేర్లు
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మోస్రా సహకార సంఘానికి ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కొత్తిమీర్ కార్ లక్ష్మణ్, చందూర్ సొసైటీకి పోతరాజు శీను, చింతకుంట ప్రవీణ్ గౌడ్, జాకోరా–కూనిపూర్ సొసైటీకి రాజిరెడ్డి, రుద్రూర్ సొసైటీకి పార్వతీ ప్రవీణ్, రాయకూరు సొసైటీకి తోట సంగయ్య, హుమ్నాపూర్ సొసైటీకి నారోజీ గంగారాం, కోటగిరి సొసైటీకి షాహిద్, పోతంగల్ సొసైటీకి శంకర్ పేర్లు ప్రతిపాదిత జాబితాలో ఉన్నట్లు సమాచారం.
మరికొన్ని సొసైటీలపై కొనసాగుతున్న పరిశీలన
ఇక గోపూర్ సొసైటీకి హనుమంతరెడ్డి, చరణ్‌రెడ్డి, వర్ని సొసైటీకి వెలగపూడి గోపాల్, నేమాని వీర్రాజు (బుజ్జన్న), ఎత్తొండ సొసైటీకి రాజాగౌడ్, ఎక్లాస్పూర్ సొసైటీకి కోటగిరి మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సహకార సంఘాల ద్వారా రైతులకు అందే సేవలు, వ్యవసాయ రుణాలు, ఇతర సహకార కార్యక్రమాల్లో సొసైటీలకు కీలక పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ల ఎంపికపై ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. పార్టీకి అనుకూలంగా పనిచేసే నాయకులకు అవకాశం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లన్నీ ప్రతిపాదిత లేదా పరిశీలనలో ఉన్నవేనని, తుది నిర్ణయం అనంతరం మాత్రమే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన?
ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాల పరిధిలోని అన్ని సొసైటీలకు సంబంధించి చైర్మన్ పదవులపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఎవరికి ఏ సొసైటీ బాధ్యత దక్కుతుందన్న అంశంపై స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.
అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే తుది జాబితాపై స్పష్టత రానుంది. అప్పటివరకు పై పేర్లను పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రతిపాదిత, పరిశీలనలో ఉన్న పేర్లుగానే పరిగణించాల్సి ఉంటుంది.