JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 11:16 am Posted by : JANA SANGARSHANA

పోస్టుమార్టం చేస్తే డబ్బులు డిమాండ్?

 

బోధన్ ఆస్పత్రిలో ఘటన

* ఆరోపణలపై స్పందించిన డీసీహెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్

* ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే  ఉద్యోగం నుంచి తొలగిస్తాం!

సెప్టెంబర్ 24 ( జన సంఘర్షణ )

పోస్టుమార్టం నిర్వహించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సోమవారం ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుపై బోధన్ జిల్లా ఆస్పత్రి డీసీహెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు గురువారం జన సంఘర్షణ’కి ఆయన వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నిర్వహించే సిబ్బంది ఫోన్‌పే ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలతో రుజువైతే, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పోస్టుమార్టం వంటి అత్యంత కీలకమైన వైద్య ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రుసుములు లేదా అదనపు డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చినా, దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫోన్‌పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లభిస్తే, వాటిని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నాయని డీసీహెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. అప్పట్లో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నప్పటికీ, వ్యవహారం అక్కడితో ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ అయితే బాధ్యుడిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పోస్టుమార్టం కోసం వచ్చే మృతుల కుటుంబ సభ్యులు   అ ప్పటికే తీవ్ర విషాదంలో ఉంటారని, అలాంటి సమయంలో వారిని ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించబోమని ఆయన పేర్కొన్నారు. బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ ఘటనకు సంబంధించి ఫోన్‌పే లావాదేవీల వివరాలు లేదా ఇతర ఆధారాలు అందితే వాటిని పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తామని డీసీహెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఆధారాలతో ఆరోపణలు రుజువైతే బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.