JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:50 pm Posted by : JANA SANGARSHANA

హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాలుపంచుకున్న ఉపరాష్ట్రపతి* ” సి.పి.రాధాకృష్ణన్ “

 

హైదరాబాద్ / సెప్టెంబర్ 17/ ( జన సంఘర్షణ

తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ- స్వతంత్ర భారత చరిత్రలో ఒక కీలక ఘట్టానికి హైదరాబాద్‌ విమోచనం ముగింపు పలికిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఈ మేరకు 1948 సెప్టెంబరు నాటి పరిణామాలు, ‘ఆపరేషన్‌ పోలో’ అనంతరం ఈ సంస్థానం భారత రాష్ట్రాల సమాఖ్యలో విలీనం కావడాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నేటి వేడుక ఒక చారిత్రక తేదీ సంస్మరణకు మాత్రమే పరిమితం కాబోదన్నారు. ఇది భారత ప్రగతి ప్రస్థానాన్ని, దేశ సమైక్యతను సమున్నతంగా నిలిపే విలువలను గుర్తుచేసే సందర్భమని ఆయన అభివర్ణించారు.

విభిన్న రాజకీయ పరిస్థితుల నడుమ ఎన్నో సంఘర్షణలకు గురైన ప్రజలను ఏకతాటిపైకి తేవడంలో ఒక నవ స్వతంత్ర దేశం ఎదుర్కొన్న అసంఖ్యాక సవాళ్లను హైదరాబాద్ చరిత్ర ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని రాజనీతిజ్ఞత, ధైర్యం, త్యాగాల గాథగా పేర్కొంటూ- ప్రతి పౌరుడికీ సమాన స్థాయినిచ్చే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య సౌధం నిర్మించే దిశగా నిరంతర, బృహత్తర ప్రక్రియ కొనసాగిందని గుర్తుచేశారు.

జాతీయ సమగ్రత దిశగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అవిరళ కృషిని ప్రస్తావిస్తూ- విభజన విషాదం నుంచి దేశం కోలుకుంటున్న వేళ భారత తొలి హోంశాఖ మంత్రిగా ఆయన అసాధారణ కర్తవ్య నిర్వహణ సదా స్మరణీయమన్నారు. వందలాది సంస్థానాలను ఒకే సమాఖ్యగా రూపొందించడంలో సంస్థానాల శాఖ మంత్రిగానూ తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారని ఉపరాష్ట్రపతి చెప్పారు. “ఈ సంస్థాన విమోచనం ద్వారా బలమైన, ఏకీకృత సమైక్య భారతానికి సర్దార్ పటేల్ దృఢమైన పునాది వేశారు” సి.పి.రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు

దేశ పురోగమనంలో వివిధ దశలను పోలుస్తూ- “స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు. అటుపైన ఆధునిక భారతంతో సంస్థానాల ఏకీకరణకు సర్దార్ పటేల్ ఎనలేని కృషి చేశారు. తదుపరి తరంలో నేడు ‘వికసిత భారత్-2047’ దిశగా ప్రస్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యం వహిస్తున్నారు” అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

హైడరాబాద్ విమోచన నేపథ్యంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని కొనియాడుతూ- ఆనాడు విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక-రాజకీయ కార్యకర్తలు, రైతులు సహా సామాన్య పౌరులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని సి.పి.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అనేకమంది కఠిన కారాగార వాసం, హింస, అంతులేని వ్యక్తిగత కష్టనష్టాలకు గురయ్యారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా రామ్‌జీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి దేశభక్తులకు నివాళి అర్పించారు. ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రసిద్ధ రాజనీతిజ్ఞుల ద్వారా మాత్రమే చరిత్రకు రూపం ఏర్పడదన్నారు. అన్యాయాన్ని విధి లిఖితంగా అంగీకరించని సామాన్యుల ధైర్యసాహసాలు కూడా చరిత్రను సృష్టించగలవని స్పష్టం చేశారు.