JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 10:00 pm Posted by : JANA SANGARSHANA

“గురుదక్షిణ” సంపాదకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ సంచాలకుల అభినందనలు

హైదరాబాద్ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 03, (జన సంఘర్షణ):

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు సంపాదకులుగా వ్యవహరించి తీర్చిదిద్దిన గురుదక్షిణ కవితా సంకలనానికి శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ ఏనుగు నరసింహారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురితమైన ఈ కవితా సంకలనం గురువుల గొప్పదనాన్ని చాటేలా ఉందని ఆయన కొనియాడారు. విద్యార్థి దశలోనే సంపాదకులుగా వ్యవహరించడం గొప్ప విషయం అన్నారు. కవితలే కాకుండా సమాజాన్ని మేలుకొల్పేలా ఉండే మరిన్ని రచనలు కూడా చేయాలని సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్ కళ్యాణ్ దాస్, నాగుల ఆంజనేయులు (అంజిబాబు)కు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది కవులు గురువు ఔన్నత్యాన్ని తెలియజేస్తూ కవితలను రాయడం మంచి పరిణామం అన్నారు. జర్నలిజం విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఇతర రంగాల్లో తమ ప్రతిభను చాటాలని సూచించారు. కళలు ప్రతిభలు ప్రతి వ్యక్తులోనూ దాగి ఉంటాయని, వాటిని వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సమాజానికి తోడ్పడేలా రచనలు చేయవలసిన అవసరం ఉందని. ఆదర్శవంతమైన రచనలు వేయి మెగదళ్లను కదిలించేలా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్సాహవంతులైన, ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి మరికొన్ని ఉత్తమ రచనలు ఆశిస్తున్నానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల వారి కార్యాలయంలో గురుదక్షిణ కవితా సంకలన సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్ కళ్యాణ్ దాస్, అంజిబాబు ఫౌండేషన్ ప్రతినిధి నాగుల ఆంజనేయులు (అంజిబాబు) మర్యాదపూర్వకంగా కలిసి గురుదక్షిణ పుస్తకాన్ని అందజేసి ముందుమాట రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.