JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 12:04 pm Posted by : JANA SANGARSHANA

చిక్కడ్‌పల్లిలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం!*

 

*నాటికలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన.. రోడ్డు భద్రత, సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాలపై చైతన్యం!!!!*

రుద్రూర్‌, బాబు/ అక్టోబర్‌ 5 (జన సంఘర్షణ):

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్‌ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో రుద్రూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిక్కడ్‌పల్లి గ్రామంలో సోమవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటికలు, పాటల ద్వారా పలు సామాజిక అంశాలపై ప్రజలకు చక్కని రీతిలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అత్యవసర సమయంలో డయల్‌ 112, ఆపద సమయంలో డయల్‌ 100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను నిరోధించడం ద్వారా తల్లి, శిశు మరణాలను తగ్గించవచ్చని వివరించారు. ఆరోగ్యం, మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.!!*

యువత మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని కళాబృందం సూచించింది. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువతను చైతన్యపరిచారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

*హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత.!*

రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్‌ ధరించాలని అవగాహన కల్పించారు. “హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.

*మైనర్లు వాహనాలు నడపడం.!* వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. వాహనదారులు అతివేగంగా, రాంగ్‌ రూట్‌లో, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఆటో డ్రైవర్లు వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదని హెచ్చరించారు.

*జీవించు.. జీవించనివ్వు.!**రోడ్డు భద్రత నియమాలు పాటించు” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని కోరారు.

*సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి…!!!!*

సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌ కాల్స్‌, సందేశాలకు స్పందించవద్దని తెలిపారు. ఒకవేళ సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

*శాంతియుత వాతావరణం కోసం సహకరించాలి…!!!*

గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజలు శాంతియుతంగా మెలగాలని, అన్ని పండుగలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు కోరారు. గ్రామంలో సుఖసంతోషాలతో, సోదరభావంతో జీవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రుద్రూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై శ్రీ సత్తయ్య, గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.