JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 9:15 pm Posted by : JANA SANGARSHANA

జన సంఘర్షణ వార్తా కథనం ఎఫెక్ట్.. కదిలిన గ్రామ పంచాయతీ పాలకవర్గం.

 

దుకాణాల అద్దెల పెంపునకు తీర్మానం.. పంచాయతీ స్థలాలపై ఉన్న దుకాణాల నిర్వహణపై కీలక నిర్ణయాలు

*గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు…. ఖాళీ స్థలాలు, దుకాణాల అద్దెలపై దృష్టి….

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో అక్టోబర్ 14/(జన సంఘర్షణ ప్రతినిధి )

పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుకాణాల అద్దెలు, పంచాయతీ స్థలాల నిర్వహణ, గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలపై అధికారులు, పాలకవర్గం దృష్టి సారించారు. గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచడంతో పాటు, పంచాయతీకి చెందిన దుకాణాల నిర్వహణలో పారదర్శకత పాటించే దిశగా గ్రామసభలో పలు తీర్మానాలు చేసినట్లు తెలిసింది.

గతంలో జన సంఘర్షణ పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి, దుకాణాల అద్దెలు పెంచడం, వాటి నిర్వహణపై నిబంధనలు అమలు చేయడం వంటి అంశాలను గ్రామసభలో చర్చించి తీర్మానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

*దుకాణాల అద్దెల పెంపునకు నిర్ణయం.

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దుకాణాలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న అద్దెలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని గ్రామసభలో తీర్మానించినట్లు సమాచారం. పంచాయతీ స్థలాల్లో దుకాణాలు నిర్వహిస్తున్నవారి నుంచి తగిన అద్దెలు వసూలు చేయడం ద్వారా గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందని పాలకవర్గం భావించినట్లు తెలుస్తోంది.

దాదాపు 20 సంవత్సరాలుగా పంచాయతీ స్థలాల్లోని దుకాణాల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, వాటి కేటాయింపులు, నిర్వహణపై స్పష్టమైన నిబంధనలు ఉండాలని చర్చకు వచ్చినట్లు తెలిసింది.

*పంచాయతీ కేటాయించిన వారికే దుకాణాల నిర్వహణ!

గ్రామ పంచాయతీ కేటాయించిన వ్యక్తులు మాత్రమే సంబంధిత దుకాణాలను నిర్వహించాలని, ఇతరులకు అప్పగించడం లేదా నిర్వహణ బాధ్యతలు బదిలీ చేయడంపై నిబంధనలు అమలు చేయాలని గ్రామసభలో నిర్ణయించినట్లు సమాచారం.

*ఈ మేరకు పత్రికా ప్రకటన…జారీ చేయడంతో పాటు, సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించి, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని తీర్మానించినట్లు తెలిసింది.

*అడ్వాన్స్‌లు, అద్దెల వసూళ్లపై చర్చ..

గ్రామ పంచాయతీ స్థలంలో ఉన్న ఒక దుకాణానికి సంబంధించి, దుకాణం పేరుపై ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తూ, స్థానికంగా దుకాణాన్ని ఇతరులకు ఇచ్చి అడ్వాన్స్‌, నెలవారీ అద్దె వసూలు చేస్తున్నారనే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.

*సదరు దుకాణానికి సంబంధించి సుమారు…..!!* రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు అడ్వాన్స్‌ తీసుకుంటున్నారని, నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారని సమాచారం అందింది. అయితే, ఈ వివరాలను సంబంధిత రికార్డులతో అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

*పంచాయతీ స్థలంలో దుకాణాలు.. నిర్వహిస్తున్నప్పుడు పంచాయతీకి చెల్లించాల్సిన అద్దె, పన్నులు తదితర అంశాలపై స్పష్టత ఉండాలని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అద్దెలను సవరించాలని గ్రామసభలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

*ఆదాయ వ్యయాల వివరాలు గ్రామసభ ముందుకు..

గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాల వివరాలను గ్రామసభ ముందు ఉంచారు. గ్రామ పంచాయతీలో సిబ్బంది ఖాళీలకు సంబంధించి తీర్మానం చేసి, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

అదేవిధంగా ఇటీవల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ (SIR), చేయూత పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్‌, వినాయక చవితి పండుగ ఏర్పాట్లు తదితర అంశాలను గ్రామసభలో వివరించారు.

*పంచాయతీ ఆదాయం పెంపుపై దృష్టి..!

గ్రామ పంచాయతీకి చెందిన స్థలాలు, దుకాణాల అద్దెలను ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించడం, దుకాణాల నిర్వహణలో నిబంధనలు పాటించడం, పంచాయతీ ఆదాయాన్ని పెంచడం వంటి అంశాలపై గ్రామసభలో తీర్మానాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

*గతంలో జన సంఘర్షణ పత్రికలో ప్రచురితమైన కథనానికి..!!!!* సంబంధించి గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో, ఈ తీర్మానాలు ఆచరణలో ఎంతవరకు అమలవుతాయన్నది వేచి చూడాలి.