JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 10:06 am Posted by : JANA SANGARSHANA

తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషకు ప్రేరణా కేంద్రంగా నిలవాలి

 

 

 

–2026 ప్రతిభా పురస్కారాల ప్రదానంలో వెంకయ్య నాయుడు ఆకాంక్ష

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,అక్టోబర్ 03, (జన సంఘర్షణ):

 

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యం లోని వివిధ రంగాల్లో విశేష సేవలు, కృషి చేసిన 12 మంది ప్రముఖులకు 2026 ప్రతిభా పురస్కారాలను భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందచేశారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు కేవలం డిగ్రీల కర్మాగారాలు కాకుండా, తెలుగు భాషా సంస్కృతులకు ప్రేరణా కేంద్రంగా,తెలుగు జాతికి సాంస్కృతిక ధర్మపీఠంగా వర్ధిల్లాలని ఆకాంక్షినిచ్చారు. భాష శ్వాస లాంటిదని, తెలుగు అమ్మ భాషాగా వెలుగుతూ, తల్లిదండ్రులు పిల్లలకు విధిగా తెలుగు ప్రాచీన కళలను నేర్పించాలని పిలుపునిచ్చారు . ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టముండదని గొప్ప ప్రతిఫలం ఉంటుందని అన్నారు.ప్రాథమిక విద్యలో తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు సాహిత్యము లోని ప్రముఖులచే నియమింపబడిన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ మూర్తులను వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలకు ఎంపిక చేసిందని వివరించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అతిథులను , పురస్కార గ్రహీతలను వేదికపైకి ఆహ్వానించారు. తెలుగు వర్సిటీ భాష సాహిత్య రంగాలకు చేస్తున్న కృషిని వివరించారు. పురస్కారాలను అందుకున్న వారిలో కవితా విభాగంలో కొట్ల వెంకటేశ్వర రెడ్డి, విమర్శలో ఆచార్య ఎన్. భక్తవత్సల రెడ్డి, చిత్రలేఖనంలో కూరెళ్ల శ్రీనివాస్, శిల్పంలో ఎ.ఎస్. ప్రకాష్, నృత్యంలో డా. హెచ్. అనిత, సంగీతంలో దుడ్డు సీతారామయ్య, పత్రికారంగంలో డా. వై. నాగేశ్వరరావు, నాటకరంగంలో సురభి వెంగమాంబ, జానపద కళారంగంలో తూర్పాటి సాలమ్మ, అవధానంలో డా. ఎం.వి. పట్వర్ధన్, ఉత్తమ రచయిత్రిగా ఆచార్య కాత్యాయని విద్మహే, నవల విభాగంలో కస్తూరి మురళీకృష్ణ ఉన్నారు. కార్యక్రమానికి విస్తరణ సేవా విభాగం ఇంచార్జ్ నెల్లుట్ల శ్రీకాంత్ సమన్వయకర్తగా వ్యవహరించారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.30,116 నగదు, శాలువ, సత్కార పత్రం అందజేసారు.