JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 10:52 am Posted by : JANA SANGARSHANA

నల్లా నర్సింహులు పోరాట స్పూర్తి …ధైర్య సాహసాలను భవిష్యత్తు తరాలకు మన ఆలోచన సాధన సమితి అక్షరాంజలి. 

నల్లా నర్సింహులు పోరాట స్పూర్తి …

ధైర్య సాహసాలను భవిష్యత్తు తరాలకు

 

మన ఆలోచన సాధన సమితి అక్షరాంజలి

నరసింహులుపై వివిధ కేసుల్లో మూడుసార్లు మరణశిక్ష విధించారు

 

ప్రజల మద్దతుతో శిక్షలు అమలు జరగలేదు

 

నల్ల నర్సింహులు గారి పోరాట స్ఫూర్తి

 

నేటి తరానికి మార్గదర్శకం

 

కటకం నర్సింగ్ రావు, వ్యవస్థాపక అధ్యక్షులు, మన ఆలోచన సాధన సమితి

 

 

 

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 01, (జన సంఘర్షణ):

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ఒక ప్రముఖ పోరాట యోధుడు నల్లా నర్సింహులు చరిత్రను కనుమరుగు చేసిన పాలకులు. తెలంగాణ చరిత్రలో 1940ల కాలం అత్యంత కీలకమైన దశ మొదలైంది.అప్పటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ రజాకార్ల పాలన కొనసాగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య ఆధిపత్యం, వెట్టిచాకిరి వంటి బలవంతపు శ్రమ, కౌలు రైతుల సమస్యలు, అధిక పన్నులు, సామాజిక అసమానతలు మరియు రాజకీయ స్వేచ్ఛల కొరత వంటి అంశాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజా సంఘటనలు, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విస్తరించాయి. ఈ చారిత్రక పరిణామాల్లో కడవెండి గ్రామం ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. నల్లా నరసింహులు ఆ నేలలోనే పెరిగి, ఆ కాలపు సామాజిక పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించి, ప్రజా ఉద్యమంలోకి ప్రవేశించారు.

సాధారణ పేద చేనేత కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు, తన చుట్టూ కనిపించిన సామాజిక అన్యాయాలను ప్రశ్నిస్తూ, గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమై, జనగామ ప్రాంతంలోని ప్రముఖ ఉద్యమ నాయకుడిగా ఎదగడం నల్లా నరసింహులుగారి జీవితంలోని ప్రధాన పరిణామం. చేనేత వృత్తే జీవనాధారంగా కలిగిన పేద పద్మశాలి కుటుంబంలో నల్లా నరసింహులు 1926 అక్టోబర్ 2న అప్పటి జనగామ తాలూకాలోని కడవెండి గ్రామంలో నల్లా లచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వారు పుట్టిన ప్రాంతం భూస్వాములైన విసునూరు దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి ఆధిపత్యంలో వెట్టిచాకిరి , దోపిడీ, అణచివేత మరియూ సామాజిక-ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉండేది…

నరసింహులు పుట్టిన కుటుంబం గ్రామీణ పేదరికం, చేనేత జీవితం, సామాజిక అసమానతలు ఆయన బాల్యాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

నల్లా నరసింహులు అప్పటి విద్యా వ్యవస్థలో ఆరో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివినప్పుడు,తన చదువుకు ఆటంకం కలిగించిన దొరలకు చెంపపెట్టులాగా ఉర్దూ మాధ్యమంలో ఏడవ తరగతి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును కొనసాగించలేక చేనేత వృత్తిలోకి వచ్చారు.అయితే పాఠశాల విద్య అక్కడితో ఆగిపోయినా, సమాజాన్ని అర్థం చేసుకునే విద్య మాత్రం ఆయన జీవితంలో కొనసాగింది. తన చుట్టూ ఉన్న పేద ప్రజల సమస్యలు, వెట్టిచాకిరి, భూస్వామ్య ఆధిపత్యం, గ్రామీణ అసమానతలు ఆయన ఆలోచనా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి.

తరువాత ఆయన పుస్తకాలు చదవడం, ప్రజలతో చర్చించడం, ఉద్యమ నాయకులతో పరిచయం పెంచుకోవడం ద్వారా సామాజిక-రాజకీయ అవగాహన పెంచుకున్నారు. కడవెండి గ్రామం తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

అదే గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య 1946 జూలై 4న జరిగిన ఘర్షణలో మరణించడం తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఈ సంఘటనతో కడవెండి పేరు తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో ప్రాధాన్యత సంతరించుకుంది.

నల్లా నరసింహులు కూడా అదే సామాజిక వాతావరణంలో ప్రజా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఎదిగారు. నరసింహులు జీవితాన్ని మార్చిన ప్రధాన మలుపుల్లో ఒకటి ఆంధ్ర మహాసభతో పరిచయం. ఆంధ్ర మహాసభ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై చర్చలు, సంఘటిత కార్యక్రమాలు మరియు సామాజిక చైతన్యం పెరిగాయి. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ అనంతరం గ్రామస్థాయి సంఘటనలకు మరింత ఊపు వచ్చింది. కడవెండిలో కూడా ప్రజలను సంఘటితం చేయడం, గ్రామ సమస్యలను చర్చించడం, వెట్టిచాకిరి మరియు అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాల్లో నరసింహులు కీలక పాత్ర పోషించారు. ఇక్కడి నుంచే నరసింహులు సాధారణ చేనేత కార్మికుడి నుంచి ప్రజా కార్యకర్తగా మారే ప్రయాణం ప్రారంభమైంది. నల్లా నరసింహులు గారి జీవితంలో ఆయన భార్య వజ్రమ్మకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.

వజ్రమ్మ కూడా ఉద్యమ కార్యకలాపాల్లో భర్తకు సహచరిగా ఉన్నారు. నరసింహులు అజ్ఞాత జీవితంలోకి వెళ్లిన సమయంలో ఆమె కూడా ఆయనతో కలిసి ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు. మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేయడం, వారికి రాజకీయ, సామాజిక అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వజ్రమ్మ క్రియాశీలక పాత్రను పోషించారు.

ఆమె కూడా అరెస్టుకు గురై,జైలు జీవితాన్ని అనుభవించారు.

దీని ద్వారా నల్లా నరసింహులు గారు జీవితంలో కేవలం వ్యక్తిగత పోరాటం కాకుండా, కుటుంబంలో కూడా ఉద్యమ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఆంధ్ర మహాసభ ప్రభావంతో గ్రామస్థాయిలో ప్రజా సంఘాలు ఏర్పడుతున్న సమయంలో నల్లా నరసింహులు జనగామ తాలూకాలోని అనేక గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేయడం,గ్రామ ప్రజలను సమస్యల చుట్టూ ఒకచోట చేర్చడం, కార్యకర్తలను తయారు చేయడం, గ్రామస్థాయి సంఘాలను బలోపేతం చేయడం ఆయన ప్రధాన కార్యక్రమాల్లో భాగమయ్యాయి. తరువాత ఈ గ్రామ సంఘాలు ఉద్యమ నిర్మాణానికి ఆధారాలుగా మారాయి. నల్లా నరసింహులు ప్రజా ఉద్యమాన్ని సంఘటితం చేయడానికి దళాలను ఏర్పాటు చేసిన నాయకుడిగా సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజా న్యాయ వ్యవస్థలు, ప్రత్యామ్నాయ పరిపాలనా విధానాలు అవలంభించడం ద్వారా జనగామ ప్రాంత దళ నాయకుడిగా ఎదిగారు. ప్రజా సంఘటనలు విస్తరించడంతో నరసింహులు గారి పాత్ర కూడా పెరిగింది.

జనగామ తాలూకాలోని అనేక గ్రామాల్లో సంఘాలను నిర్మించి, కార్యకర్తలను సమీకరించి, ఉద్యమ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. అగ్ర నాయకత్వం, గ్రామస్థాయి కార్యకర్తల మధ్య సమన్వయం చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది.ఆయన నాయకత్వంలో దాదాపుగా 122 దళాలు ఏర్పాటయ్యాయి. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానంలోని గ్రామీణ సమాజంపై గణనీయమైన ప్రభావం చూపింది.

ఈ పోరాటం ప్రధానంగా నిజాం పాలనకు, భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగింది. వెట్టిచాకిరి నిర్మూలన, కౌలు రైతుల హక్కులు, భూమి సమస్యలు మరియు గ్రామీణ ప్రజల సామాజిక హక్కులు ఉద్యమంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో ఉద్యమం విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజా సంఘాలు స్థానిక పరిపాలనా వ్యవస్థలకు ప్రత్యామ్నాయ నిర్మాణాలను కూడా ఏర్పరచాయి.

నల్లా నరసింహులు ఈ ఉద్యమంలో జనగామ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. స్థానిక భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం నుంచి ఆయన ఉద్యమ ప్రయాణం మరింత విస్తరించింది. 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం మరింత ఉధృతం కావడానికి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉద్యమ కార్యకలాపాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఉద్యమం తీవ్రతరం కావడంతో నల్లా నరసింహులు అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. ఆయనతో పాటు వజ్రమ్మ కూడా అజ్ఞాత జీవితాన్ని అనుభవించారు. గ్రామాల మధ్య సంచారం, కార్యకర్తలతో సంబంధాలు, ప్రజా సంఘాల నిర్మాణం, ఉద్యమ కార్యకలాపాల నిర్వహణ ఆయన జీవితంలో భాగమయ్యాయి.తరువాతి దశలో నల్లమల, రాచకొండ ప్రాంతాల అరణ్యాల్లో అజ్ఞాత జీవితం గడిపారు.

నరసింహులు మహిళలను ఉద్యమ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడం,మహిళా కార్యకర్తలను సంఘటితం చేయడం, వారికి రాజకీయ అవగాహన కల్పించడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాల వలన మరియూ స్వయంగా వజ్రమ్మ ఉద్యమంలో పాల్గొనడం వలన విస్తృతంగా మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ప్రత్యేకతను సంతరించుకున్నాడు. నల్లా నరసింహులుగారి జీవితంలో అరెస్టులు, జైలు జీవితం మరియు కోర్టు కేసులు ఒక పెద్ద అధ్యాయంగా నిలిచాయి.ఆయన అనేకసార్లు అరెస్టయ్యారు. కొన్ని సందర్భాల్లో జైలు నుంచి తప్పించుకున్నారు.అనేక కేసుల్లో ఆయన స్వయంగా తన వాదనలు తనే వినిపించుకున్నారు, కోర్టులో రాజకీయ-సామాజిక అంశాలపై విస్తృతంగా వాదించేవారు. నరసింహులుపై వివిధ కేసుల్లో మూడుసార్లు మరణశిక్ష విధించినప్పటికీ,శిక్షలు అమలు జరగలేదు. నల్లా నరసింహులు జీవితానికి అత్యంత ప్రాచుర్యం పొందిన బిరుదు “తెలంగాణ టైగర్” కోర్టుల్లో ఆయన ధైర్యంగా తన వాదనలు వినిపించిన తీరు, పోలీసు మరియు న్యాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొన్న విధానం కారణంగా తనని ఎన్నో సందర్భాలలో పట్టుకున్న పోలీసులే “తెలంగాణ టైగర్” అని పిలవడం,సాటి పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పడంతో జనగామ ప్రాంతంలో ఆయనను “విప్లవ సింహం”, “తెలంగాణ టైగర్” వంటి పేర్లతో స్మరించడమనేది సంప్రదాయంగా వస్తుంది. 1948 సెప్టెంబర్ 17 తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైనప్పటికీ, తెలంగాణలో కమ్యూనిస్టు రైతాంగ సాయుధ పోరాటం వెంటనే ముగియలేదు.ఉద్యమం కొనసాగింది. ఈ దశలో నల్లా నరసింహులు సహా అనేక మంది నాయకులు అజ్ఞాత జీవితం కొనసాగించారు. పోలీసు మరియు సైనిక చర్యలు, అరెస్టులు, కేసులు మరియు అరణ్య ప్రాంతాల్లో దాగి జీవించడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.విలీనం తరువాత భారత భద్రతా బలగాలు మరియు కమ్యూనిస్టు దళాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. ఈ దశలో అనేక మందిపై కేసులు నమోదయ్యాయి.

“తెలంగాణ ట్వెల్వ్”గా చరిత్రలో ప్రస్తావించబడిన పన్నెండు మంది ఖైదీలకు మరణశిక్ష విధించబడిన సందర్భం గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు మరియు న్యాయపరమైన చర్యల నేపథ్యంలో ఆ ఉరిశిక్షలు ఆ సమయంలో అమలు కాలేదు.నల్లా నరసింహులుగారి జీవితంలో కూడా సికింద్రాబాద్ జైలు, మరణశిక్ష మరియు చివరి దశలో శిక్ష నిలిచిపోయిన సంఘటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1951లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించుకునే నిర్ణయం తీసుకుంది.

నల్లా నరసింహులుగారు 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాట విరమణకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.ఆ నిర్ణయం తరువాత కూడా నరసింహులుగారి వ్యక్తిగత న్యాయపరమైన సమస్యలు వెంటనే ముగియలేదు.ఆయనపై ఉన్న కేసులు, జైలు జీవితం మరియు మరణశిక్షకు సంబంధించిన న్యాయపోరాటం కొనసాగింది. నల్లా నరసింహులుగారి జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైన అంశాల్లో వజ్రమ్మ జైలు జీవితం ఒకటి.సాయుధ పోరాటం ముగిసే దశలో వజ్రమ్మ అరెస్టయి జైలులో ఉండగా ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.ఈ సంఘటన ఆ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలు ఎదుర్కొన్న వ్యక్తిగత కష్టాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. 1952లో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో నిషేధిత కమ్యూనిస్టు పార్టీకి బదులుగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు.

నల్లా నరసింహులు స్వయంగా ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికి,ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రాంతంలో రైతాంగ ఉద్యమానికి ఉన్న సామాజిక-రాజకీయ ప్రభావంపై చర్చకు దారితీశాయి. పోరాటం ముగిసిన తరువాత కూడా నరసింహులుగారి జీవితంలో కేసులు కొనసాగాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూ, తనపై ఉన్న కేసులను ఎదుర్కొంటూ సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపారు. అప్పటి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో ఆయన చివరి మరణశిక్ష నుంచి

సుదీర్ఘమైన న్యాయపోరాటం అనంతరం 1959 జనవరి 26న నల్లా నరసింహులు జైలు నుంచి విడుదలయ్యారు

అది ఆయన జీవితంలో మరో కీలక మలుపు. చాలా సంవత్సరాల అజ్ఞాత జీవితం, అరెస్టులు, కేసులు, జైలు మరియు మరణశిక్షల తర్వాత సాధారణ ప్రజా జీవితంలోకి తిరిగి రావడం ఆయన జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

జైలు నుంచి విడుదలైన తరువాత నరసింహులు బొంబాయి, షోలాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పార్టీ కార్యకర్తలు మరియు ఉద్యమ సహచరులతో గడిపారు.అయితే ఆయన జీవితాన్ని కేవలం మావోయిస్టు, కమ్యూనిస్టు సంఘటనలకే పరిమితం కాకుండా, తరువాతి దశలో తన అనుభవాలను చరిత్రగా నమోదు చేసిన నల్లా నరసింహులు గారి జీవితంలో అత్యంత ముఖ్యమైన వారసత్వాల్లో ఒకటిగా ఆయన రచన నిలిచింది.

1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవ సందర్భంలో ఉద్యమ యోధులు తమ అనుభవాలను నమోదు చేయాలనే పిలుపు వచ్చినప్పుడు, సాధారణ నివేదికకు బదులుగా నల్లా నరసింహులు తన అనుభవాలను విస్తృతంగా రాశారు. ఆ రచన “తెలంగాణా సాయుధ పోరాటం — నా అనుభవాలు” అనే పుస్తకంగా రూపుదిద్దుకుంది. ఇది 1989లో ప్రచురితమైంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కూడా “తెలంగాణా సాయుధ పోరాటం నా అనుభవాలు — నల్లా నరిసింహులు” పేరుతో ఈ రచనను నమోదు చేసి అందుబాటులో ఉంచింది.

ఈ పుస్తకం కారణంగా నల్లా నరసింహులు కేవలం పోరాట యోధుడిగానే కాకుండా, తన కాలాన్ని స్వయంగా నమోదు చేసిన వ్యక్తిగా కూడా ప్రాధాన్యం పొందారు. తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను వివరించే కొన్ని ఉద్యమ చరిత్రలు పేద రైతులకు సుమారు 10 లక్షల ఎకరాల భూమిని నల్లా నర్సింహులు గారి నేతృత్వంలో పంపిణీ చేశారు.

అదేవిధంగా పోరాటంలో మరణించిన 4,000 మంది గురించి కూడా ఆయన తన స్వీయ చరిత్ర లో పొందుపరిచారు.

జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా నల్లా నరసింహులు తన గతాన్ని మరచిపోలేదు. తనతో కలిసి పోరాడిన సహచరులు, తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారు, భూమి మరియు సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమం — ఇవన్నీ ఆయన జీవితాంతం స్మృతుల్లో నిలిచాయి. ఆయన జీవితం గురించి వచ్చిన జీవితచరిత్రలో “జీవితమే ఒక నిరంతర పోరాటం” అనే భావవ్యక్తీకరణ చేశారు.

నల్లా నరసింహులు తన జీవితపు చివరి దశలో కూడా ప్రజా సమస్యలు, తెలంగాణ రైతాంగ పోరాటం మరియు తన అనుభవాలను స్మరించుకుంటూ జీవించారు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే మూడు విభిన్న దశలు స్పష్టంగా కనిపిస్తాయి: మొదటి దశ: పేద చేనేత కుటుంబంలో బాల్యం, విద్య, వృత్తి. రెండవ దశ:ఆంధ్ర మహాసభ పరిచయం, గ్రామ సంఘాల నిర్మాణం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అజ్ఞాత జీవితం, అరెస్టులు జైలు. మూడవ దశ: 1959 విడుదల తర్వాతి జీవితం, గత అనుభవాల స్మరణ, రచన మరియు చారిత్రక జ్ఞాపకాల పరిరక్షణ.

ఈ మూడు దశల సమాహారమే నల్లా నరసింహులుగారి సంపూర్ణ జీవితాన్ని నిర్మించింది.1993 నవంబర్ 5న నల్లా నరసింహులు మరణించారు. 1926 అక్టోబర్ 2న జన్మించిన ఆయన సుమారు 67 సంవత్సరాలు జీవించారు.

కడవెండి గ్రామంలో ప్రారంభమైన ఆయన జీవితం తెలంగాణ చరిత్రలోని అత్యంత కీలకమైన దశలను దాటి సాగింది.

మరణానంతరం కూడా ఆయన పేరు తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, కడవెండి గ్రామ చరిత్ర మరియు జనగామ ప్రాంత ప్రజా ఉద్యమాల సందర్భాల్లో కొనసాగుతూ వచ్చింది. నల్లా నరసింహులుగారి జీవితాన్ని కేవలం వీరగాథగా మాత్రమే చూడటం కంటే, ఆయన జీవించిన కాలంలోని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులతో కలిపి అధ్యయనం చేయడం,ఆయన జీవితంలో ఒకవైపు నిజాం పాలనలోని గ్రామీణ వ్యవస్థ, మరోవైపు భూస్వామ్య సంబంధాలు, మరోవైపు ఆంధ్ర మహాసభ ద్వారా వచ్చిన ప్రజా చైతన్యం, ఆ తరువాతి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1948 తర్వాతి పరిణామాలు, దీర్ఘకాల జైలు జీవితం మరియు చివరకు తన అనుభవాలను రచనగా భద్రపరచడం వలన నల్లా నరసింహులు జీవిత చరిత్ర ఒక వ్యక్తి జీవితకథ మాత్రమే కాదు. 20వ శతాబ్దపు మధ్యకాల తెలంగాణ గ్రామీణ సమాజంలో జరిగిన ఒక గొప్ప చారిత్రక పరివర్తనను ఒక వ్యక్తి జీవితంలో చూసే అవకాశం కల్పించే చరిత్రగా చూడవచ్చు.

కడవెండి గ్రామంలోని ఒక సాధారణ పేద చేనేత కుటుంబంలో 1926 అక్టోబర్ 2న జన్మించిన నల్లా నరసింహులు, తన కాలంలోని సామాజిక పరిస్థితులతో ప్రభావితమై ప్రజా ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆంధ్ర మహాసభతో పరిచయం ఆయన జీవితానికి కొత్త దిశను ఇచ్చింది. గ్రామ సంఘాల నిర్మాణం ద్వారా ప్రజలను సంఘటితం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగామ ప్రాంతంలో ప్రముఖ పాత్ర పోషించారు. అజ్ఞాత జీవితం, అరెస్టులు, జైలు, కోర్టు కేసులు మరియు మరణశిక్షలను ఎదుర్కొన్నారు. ఆయన భార్య వజ్రమ్మ కూడా ఉద్యమ జీవితంలో భాగస్వామిగా నిలిచారు. కుటుంబం కూడా ఆ కాలపు రాజకీయ పరిస్థితుల ప్రభావాన్ని తీవ్రంగా అనుభవించింది.1959 జనవరి 26న జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నరసింహులు తన గతాన్ని మరచిపోలేదు. చివరకు తన అనుభవాలను “తెలంగాణా సాయుధ పోరాటం — నా అనుభవాలు” అనే పుస్తకంగా నమోదు చేసి, తరువాతి తరాలకు ఒక వ్యక్తిగత చారిత్రక ఆధారాన్ని అందించారు.

1993 నవంబర్ 5న ఆయన మరణించినప్పటికీ, కడవెండి, జనగామ మరియు తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో నల్లా నరసింహులుగారి పేరు కొనసాగుతోంది. నల్లా నరసింహులు అంటే కేవలం “తెలంగాణ టైగర్” అనే బిరుదు కాదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి తన కాలంలోని సామాజిక పరిస్థితులతో ఎలా ప్రభావితమయ్యాడు, ప్రజా ఉద్యమంలో ఎలా ఎదిగాడు, జైలు–న్యాయపోరాటాలను ఎలా ఎదుర్కొన్నాడు, చివరకు తన అనుభవాలను చరిత్రగా ఎలా భద్రపరిచాడు అనే జీవన ప్రయాణం.

ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే తెలంగాణ చరిత్రలోని ఒక కీలక కాలాన్ని అధ్యయనం చేయడమే.

నల్లా నరసింహులు జీవితం — తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన పోరాట వారసత్వంగా నిలిచిపోతుంది.

వారు కొనసాగించినటువంటి జీవితం,వారి పోరాట స్ఫూర్తి,వారి పోరాట పటిమను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన ఆలోచన సాధన సమితి ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి,వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని నిశ్చయించింది. అక్టోబర్ 2వ తేదీన జరిగే నల్లా నర్సింహులు శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా గ్రామ గ్రామాన, అన్ని ప్రాంతాల్లో నిర్వహించినట్లయితే వారికి నిజమైన నివాళులు అర్పించినవాళ్లం అవుతాం. వారు మనకు చూపించిన మార్గదర్శనం—వెట్టి చాకిరీ, దొరల దోపిడీ, అప్రజాస్వామిక పరిపాలన, భూస్వాముల దోపిడీ—వంటి అంశాలను నేటి సమాజానికి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం అర్థం చేసుకోగలిగితే చైతన్యవంతులం అవుతాం. రాబోయే బహుజనవాదాన్ని, బహుజన తత్వాన్ని, రాజ్యాధికారాన్ని సాధించడానికి ఇది మనకు అనుకూలంగా ఉంటుందని మన ఆలోచన సాధన సమితి విశ్వసిస్తుంది.