*ప్లాస్టిక్ నిషేధం.. నీటి సంరక్షణ, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి: సర్పంచ్ బర్ల మధుకర్!!!*
కోటగిరి, అక్టోబర్ 3 (జనసంఘర్షణ): నిజామాబాద్ జిల్లా
కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ సాఫీగా, విజయవంతంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను చదివి వినిపించారు. అనంతరం గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై గ్రామసభలో చర్చించారు
*ఈ సందర్భంగా సర్పంచ్ బర్ల మధుకర్ మాట్లాడుతూ!!!!*.. మద్యానికి బానిస కావడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని, కుటుంబాలు ఇబ్బందులకు గురై రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు గ్రామసభలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.
మద్యపానానికి దూరంగా ఉండి కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
*ప్లాస్టిక్ రహిత గ్రామంగా కోటగిరి!!!*
ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను గ్రామసభలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడంతో మురుగు నీటి పారుదల సమస్యలు ఏర్పడటంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సర్పంచ్ తెలిపారు.
*గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి*, ప్లాస్టిక్ రహిత గ్రామంగా కోటగిరిని తీర్చిదిద్దేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి చెత్త నిర్వహణను సక్రమంగా చేపట్టాలని సూచించారు.
*నీటి సంరక్షణకు ప్రాధాన్యత..!!!*
వీబీజీ రామ్ ఉపాధి హామీ పనుల్లో భాగంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ సూచించారు. గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం, తాగునీటి సంరక్షణ, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
*గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించి, అవసరమైన తీర్మానాలను* *గ్రామసభలో ఆమోదించారు. మద్యపాన నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, నీటి సంరక్షణ, పారిశుధ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఈ గ్రామసభలో గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్, సర్పంచ్ బర్ల మధుకర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.