- వాహనాల విడుదలకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు.. సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
విచారణ అనంతరం చర్యలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం
కరీంనగర్ /, అక్టోబర్ 8/:(జన సంఘర్షణ)
బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఇద్దరు పోలీసు అధికారులు, ఓ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి చెందిన నగునూరి బాబుకు సంబంధించిన జేసీబీ, మూడు ట్రాక్టర్లను విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎల్ఎండీ ఎస్సై అన్వర్, కానిస్టేబుల్ అజీజ్‌పై వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిని ఇప్పటికే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.
ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదికను మల్టీజోన్-1 ఐజీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం. విచారణ అనంతరం ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
*వాహనాల విడుదలకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు*
బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జేసీబీ, ట్రాక్టర్లను విడుదల చేసేందుకు రూ.50 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్సై డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. అందులో భాగంగా రూ.30 వేల నగదును ఇవ్వడంతో పాటు, మరో రూ.20 వేలను తిమ్మాపూర్‌లోని ఓ వైన్స్ నిర్వాహకులకు ఫోన్‌పే ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని ఓ కానిస్టేబుల్ ద్వారా తెప్పించుకున్నారని ఆరోపించారు.
*మరోవైపు వాహనాల విడుదల కోసం..!!!* ప్రభుత్వానికి జరిమానా చెల్లించినట్లు బాబు తెలిపారు. మూడు ట్రాక్టర్లకు రూ.5 వేల చొప్పున రూ.15 వేలు, జేసీబీకి రూ.10 వేల డీడీ చెల్లించినట్లు పేర్కొన్నారు. అనంతరం తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వాహనాల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
అయితే ఆ ఉత్తర్వులతో ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, అదనంగా రూ.లక్ష చెల్లించాలని సీఐ, ఎస్సై కోరారని, లేదంటే వాహనాలపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పినట్లు బాబు ఆరోపించారు.
*విచారణ అనంతరం సస్పెన్షన్..
ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ముగ్గురినీ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసి, అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ నిర్వహించినట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.