JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:29 am Posted by : JANA SANGARSHANA

వాస్తవాధారిత వార్తలే ప్రజలకు అందించాలి

జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలి: పోచారం శ్రీనివాసరెడ్డి

నిజామాబాద్/, సెప్టెంబర్‌ 30 (జనసంఘర్షణ):

బాన్సువాడ జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎలాంటి ఆశలు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

ఒక వార్త సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత ముఖ్యమని అన్నారు. వార్తల్లో నిజానిజాలను పరిశీలించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం జర్నలిస్టుల వృత్తిపరమైన బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మీడియా రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్‌, సోషల్‌ మీడియా విస్తరణతో సంఘటనలు జరిగిన వెంటనే సమాచారం ప్రజలకు చేరుతోందన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవాధారిత వార్తలను అందించాలని ఆకాంక్షించారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత

బాన్సువాడలో జర్నలిస్టుల సంక్షేమానికి గతంలోనే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితమే బాన్సువాడలో సుమారు 60 మంది రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రతకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

 

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.