
— అన్నదానం, పాలు, పండ్ల పంపిణీ.
–ముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు (టిడబ్ల్యూజేఎఫ్) ఎర్ర యాకయ్య.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, నవంబర్ 08 (జన సంఘర్షణ) :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా, సేవా కార్యక్రమాల నడుమ సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న రాజేశ్వరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త సాయి సుభాన్ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
వృద్ధులతో కలిసి వేడుకలు:
సమాజంలో అట్టడుగున ఉన్న వృద్ధులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఆశ్రమ వాసులకు ఘనంగా అన్నదానం నిర్వహించారు. అలాగే వారికి పాలు, పండ్లు పంపిణీ చేసి ఆప్యాయంగా పలకరించారు. వృద్ధుల ముఖంలో చిరునవ్వులు చూడటమే తమకు అసలైన జన్మదిన వేడుక అని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ముఖ్య అతిథుల ఆశీస్సులు, శుభాకాంక్షలు:
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎర్ర యాకన్న మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన మరిన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన దిపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు:
ఈ సేవా కార్యక్రమంలో ఆకాంక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు చిట్టినీడి వెంకట రామారావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.