*10 ఎకరాల భూమి హద్దుల్లో హెచ్చరిక బోర్డు, జెండాల ఏర్పాటు.. అనుమతి లేకుండా ప్రవేశిస్తే చర్యలు తప్పవనే సంకేతం.!
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/నవంబర్ 11/ (జన సంఘర్షణ):
ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు అర్హులైన లబ్ధిదారుల హక్కులను కాపాడే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మద్నూర్ మండలంలోని మధన్ హిప్పర్గ గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 33లోని 10 ఎకరాల భూమి వద్ద మంగళవారం హెచ్చరిక బోర్డు, సరిహద్దుల్లో జెండాలను ఏర్పాటు చేశారు.
గతంలో ప్రభుత్వం ఈ భూమిని సేకరించి.. లబ్ధిదారులకు ఇంటి స్థలాలుగా కేటాయించడంతో పాటు పట్టా ధ్రువపత్రాలను సైతం పంపిణీ చేసింది. అయితే విద్యుత్ కనెక్షన్లు, రహదారి సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని పూర్వపు పట్టాదారు ఖాళీగా ఉన్న భూమిలో వరి సాగు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై 2019లో పంటను ధ్వంసం చేయవద్దంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
*ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో.పర్యటించి భూమి హద్దులను గుర్తించారు. భూమి సరిహద్దుల్లో జెండాలు, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి అనధికారికంగా భూమిలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు.
*ప్రభుత్వ భూముల పరిరక్షణతో.పాటు పేద లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు వారి అవసరాలకు ఉపయోగపడేలా చూడటం అధికారుల బాధ్యతగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారి, మద్నూర్ ఎస్సై గిర్దావర్, జీపీఓ, సర్వేయర్ పాల్గొన్నారు.