JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 3:50 pm Posted by : JANA SANGARSHANA

వరి కొయ్యలను కాల్చొద్దు.. భూసారాన్ని కాపాడుకోండి!

నేల ఆరోగ్య పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా..!

*ఖేత్ బచావో అభియాన్‌లో రైతులకు అవగాహన కల్పించిన ఏఓ నిషిత.!

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/నవంబర్ 12:/(జన సంఘర్షణ)

*కల్లూరు..

రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వరి కోత అనంతరం పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని మండల వ్యవసాయ అధికారి నిషిత సూచించారు. భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను అధిగమించేందుకు పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

పోతంగల్ మండలంలోని కల్లూరు.గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో ఆమె రైతులకు పలు కీలక వ్యవసాయ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఏఓ నిషిత మాట్లాడుతూ..! వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన గడ్డిని తగులబెట్టడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించిపోతాయని, తద్వారా భూసారం తగ్గి పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు. రైతులు వరి గడ్డిని కాల్చకుండా పొలంలోనే కుళ్లిపోయేలా చేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్‌ఎస్‌పీ (SSP) ఎరువును ఉపయోగించడం ద్వారా వరి గడ్డి సేంద్రియ ఎరువుగా మారి తదుపరి పంటకు ఉపయోగపడుతుందని, నేలలో సారవంతం పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు.

*పంటల మార్పిడితోనే నీటి సమస్యకు పరిష్కారం

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో సాగునీటి లభ్యతపై అనిశ్చితి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా జొన్న, కుసుమ, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయా పంటల సాగు కాలం, నీటి అవసరాలు, అనుకూలమైన విత్తన రకాల గురించి రైతులకు వివరించారు

*నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి!

*ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ ఏఈఈ రవికుమార్ మాట్లాడుతూ..! ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల పరిస్థితిని వివరించారు. భవిష్యత్తులో నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ పొదుపు పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.

*రైతులకు దిశానిర్దేశం చేసిన అవగాహన కార్యక్రమం..

*నేల ఆరోగ్య పరిరక్షణ..పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూ వ్యవసాయం చేస్తేనే భవిష్యత్తు తరాలకు సారవంతమైన భూమిని అందించగలమని పేర్కొన్నారు.

*ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారి నిషిత, ఇరిగేషన్ ఏఈఈ రవికుమార్, ఏఈఓ అరుణ్, గ్రామ సర్పంచ్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ దశరథ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

*రైతు సంక్షేమమే లక్ష్యంగా.భూసార పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.