పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించబడే పాలిసెట్ – 2026 నోటిఫికేషన్ విడుదలైనట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ దరఖాస్తులు 2 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభమై 20 ఏప్రిల్ 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోటగిరి కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే కోర్సులు నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే నూతన కోర్స్ ప్రారంభించబడినట్లు తెలిపారు. పాలిసెట్ – 2026 దరఖాస్తులు నింపడం, ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు సహాయం అందించేందుకు కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలకు ప్రత్యక్షంగా వచ్చి మార్గదర్శనం పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు 9948264254, 8332919395 మరియు 9491361663 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు.


