Homeతెలంగాణనిజామాబాద్ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి

ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి

📰 Generate e-Paper Clip

• ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్‌యూ డిమాండ్

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ రూపాల్లో దోపిడీ చేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్‌కు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫాంలు, షూలు, టైలు, బెల్టులు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు.

అడ్మిషన్ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, రోబోటిక్స్, గేమ్స్ తదితర పేర్లతో విద్యార్థుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ.10 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు సిర్రం పవన్‌కుమార్‌తో పాటు నాయకులు మనోజ్, శ్రీకర్, భవాని, అరవింద్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular