Homeఎడిటోరియల్బోరబండలో ఒకే రోజు నలుగురు అదృశ్యం.. నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు

బోరబండలో ఒకే రోజు నలుగురు అదృశ్యం.. నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు

📰 Generate e-Paper Clip

బోరబండలో ఒకే రోజు నలుగురు అదృశ్యం.. నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు

హైదరాబాద్,/ జూలై 19: (జన సంఘర్షణ):

హైదరాబాద్ బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకే రోజు నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటనలు నమోదవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు కనిపించకుండా పోవడంతో బోరబండ పోలీసులు నాలుగు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*పీజీ హాస్టల్ నుంచి యువకుడు అదృశ్యం..*

చింతల్ ద్వారకానగర్‌కు చెందిన గంగాజీ అరవింద్ ఫిర్యాదు మేరకు, ఆయన మేనల్లుడు సుమిత్ భరత్ లంకపురె (19) ఎర్రగడ్డలోని పద్మావతి మెన్స్ పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి తన బ్యాగ్‌తో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిపారు.

*’ఇదే నా చివరి సందేశం’ అంటూ భర్త అదృశ్యం…*

ఎర్రగడ్డ శంకర్‌లాల్ నగర్‌కు చెందిన ఎం. దినేష్ కుమార్ (33) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో వాగ్వాదం అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన భార్య ప్రసూనకు “ఇదే నా చివరి సందేశం… నేను తిరిగి రాను” అంటూ మొబైల్ సందేశం పంపినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

*ఇంటి నుంచి యువతి కనిపించకుండా పోవడం*

ఈఎస్‌ఐ దవాఖానలో హెల్పర్‌గా పనిచేస్తున్న షేక్ షోయబ్ ఫిర్యాదు మేరకు, ఆయన భార్య షేక్ జకీరా (19) ఈ నెల 17న ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సమయంలో ఆమె కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

*మానసిక దవాఖాన నుంచి చికిత్స పొందుతున్న వ్యక్తి పరార్*

వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన అబ్బాని జగదీశ్వర్ (28) ఎర్రగడ్డ మానసిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి దవాఖాన నుంచి వెళ్లిపోయినట్లు ఆయన సోదరుడు వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దవాఖాన పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.

ఈ నాలుగు ఘటనలపై బోరబండ పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే, సంబంధిత సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular