♦ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూసిన కాంగ్రెస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు
♦ కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 22% నుండి 37% మైనారిటీలే: బీజేపీ స్పష్టం
♦ సిఎఎ (CAA) చట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీసింది: ఎన్. రామచందర్ రావు
♦ వందేమాతరం దేశభక్తికి ప్రతీక.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కించపరచవద్దు: బీజేపీ మైనారిటీ మోర్చా సమావేశం
(శ్రావణ్ స్పెషల్ కరస్పాండెంట్ హైదరాబాద్ ✍️)
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ సమాజంలో విభజన రాజకీయాలు చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ఎన్ని కులాలు, మతాలు ఉన్నా భారతీయులుగా ఐక్యంగా జీవించడమే ఈ దేశ గొప్పతనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డి.కే. అరుణతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశంలో అత్యధిక మత ఘర్షణలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, వారి హయాంలోనే జరిగాయని రామచందర్ రావు చారిత్రక వాస్తవాలను గుర్తుచేశారు. వాజ్‌పేయి హయాం నుండి నేటి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన వరకు బీజేపీ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే నినాదంతో సమన్యాయ పాలన అందిస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్రా, జన్ ధన్, ఉజ్వల, ఉడాన్ వంటి ప్రతి సంక్షేమ పథకంలో 22 శాతం నుండి 37 శాతం వరకు లబ్ధిదారులు మైనారిటీ వర్గాల వారే ఉండటం మోదీ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని తెలిపారు. ఏటా మైనారిటీ విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని చెప్పారు. ముస్లిం యువత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (IAS, IPS) పరీక్షల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందని వివరించారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కాంగ్రెస్ పార్టీ కల్పించిన అపోహలను రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఉండిపోయిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అక్కడి మత చాందసవాదుల చేతుల్లో బలవంతపు మతమార్పిడులు, అణచివేతకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చారని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ సైతం అక్కడ వివక్షను తట్టుకోలేక భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని రామచందర్ రావు గుర్తుచేశారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని మన దేశానికి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించడమే సిఎఎ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందని ఆరోపించారు. పూర్వ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టానికి మత రంగు పూసి, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.
నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి దేశభక్తులు సైతం ‘వందేమాతరం’ నినదిస్తూ ప్రాణాలర్పించారని స్మరించుకున్నారు. వందేమాతరం ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అది పవిత్రమైన భరతమాతను గౌరవించే జాతీయ గేయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని కించపరచవద్దని హితవు పలికారు.
1937లో ముస్లిం లీగ్‌కు భయపడి వందేమాతరాన్ని మొదటి రెండు చరణాలకే పరిమితం చేసిన కాంగ్రెస్, నేడు కేరళలో జమాతే ఇస్లామీ, తెలంగాణలో ఎంఐఎం (AIMIM) పార్టీల ఓటు బ్యాంకుకు భయపడి వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వంలో మాత్రమే మైనారిటీలకు నిజమైన రక్షణ, విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో సమాన అవకాశాలు అందుతున్నాయని, ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని మైనారిటీ మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు.


