* తెలిసిన ఆదాయానికి మించిన 6.13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం..!
* 8 ప్రాంతాల్లో సోదాలు
హైదరాబాద్/సెప్టెంబర్ 23/(జన సంఘర్షణ)
హైదరాబాద్: నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. తెలిసిన ఆదాయ వనరులకు పొంతన లేకుండా సుమారు రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ఆరోపించింది. ఈ కేసులో భాగంగా హైదరాబాద్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
సోదాల్లో హైదరాబాద్‌లోని 8 ఫ్లాట్లు, విశాఖపట్నంలో 800 చదరపు గజాల ప్లాట్‌తో పాటు మరో 5 ఓపెన్ ప్లాట్లు గుర్తించినట్లు సమాచారం. అలాగే రూ.41 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌లు, రూ.12 లక్షల పోస్టాఫీస్ డిపాజిట్లు, రూ.35 లక్షల ప్రైవేట్ ఆర్థిక పెట్టుబడులు, రూ.29.55 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు పేర్కొంది.
అదేవిధంగా 517.8 గ్రాముల బంగారం, జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ కార్లతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.5 లక్షల విలువైన గాడ్జెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు రూ.1.30 కోట్ల పెట్టుబడులు, రూ.1.33 కోట్లను ఇతరులకు చేతి రుణాలుగా ఇచ్చినట్లు కూడా ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం.
* ఆస్తులపై కొనసాగుతున్న సోదాలు..!
సోదాల్లో గుర్తించిన ఆస్తులు, పెట్టుబడులు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఆస్తుల ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
* అవినీతిపై సమాచారం ఇవ్వండి..!
ప్రజలు ఎక్కడైనా లంచం డిమాండ్ చేయడం, అవినీతి లేదా అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అవినీతిని అరికట్టడంలో ప్రజల సహకారం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.


