
–కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: శేరి సతీష్ రెడ్డి.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు,అక్టోబర్ 23 (జన సంఘర్షణ):
కూకట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డిపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఆయన ఇచ్చిన వివరణను పరిశీలించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేతపై శేరి సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ నాయకత్వానికి, క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవికి, కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అనంతులకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని పేర్కొన్న శేరి సతీష్ రెడ్డి.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి, కష్టకాలంలో అండగా నిలిచిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పదవుల కంటే పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత పదవులు, అధికారమే తనకు ముఖ్యం కాదని, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం, పార్టీ అభివృద్ధే తనకు బలమని అన్నారు. పార్టీ క్రమశిక్షణను గౌరవిస్తూ స్థానిక నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ కమిటీతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని శేరి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేతతో కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.


