–సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వైభవంగా జానపద సాంప్రదాయ వంటల ప్రదర్శన.
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, నవంబర్ 05, (జన సంఘర్షణ):
ఆధునిక నాగరికత ముసుగులో కనుమరుగవుతున్న గ్రామీణ సంస్కృతిని, పూర్వీకుల ఆరోగ్య రహస్యాలను నేటి తరానికి పరిచయం చేస్తూ హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద కళల శాఖ ఆధ్వర్యంలో ‘జానపద విద్యార్థుల సాంప్రదాయ వంటల ప్రదర్శన’ గురువారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయ లలిత కళల పీఠం పరిధిలోని జానపద కళల శాఖ విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొని, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తమ ప్రాంతాల విశిష్టమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ప్రదర్శించారు. కట్టెల పొయ్యిల ఘుమఘుమలు, మట్టి పాత్రల పరిమళాలు, జానపద గీతాల ఆలపనలతో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా ఒక పల్లెటూరి పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఉత్సాహంగా ప్రారంభమైన ఆహార మహోత్సవం
ఈ ప్రదర్శనను విశ్వవిద్యాలయ జానపద కళల శాఖ పీఠాధిపతి ఆచార్య రాధ, జానపద కళల శాఖ అధ్యక్షులు డాక్టర్. గుడిపల్లి రవి కుమార్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సంజీవ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన సామాజిక జీవితాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థుల వేషధారణ , వంటకాల ప్రదర్శన ఉన్నాయని. గిరిజన సాంప్రదాయ వంటకాలలో పోషక విలువలు, ఆరోగ్య రహస్యాలు నిగూఢంగా దాగి ఉన్నాయని. అర్బనైజేషన్ ఇండస్ట్రీయలైజేషన్ మూలంగా నేటి తరానికి సాంప్రదాయ ఆహార పదార్థాల విలువలు వంటపద్దతులు తెలియకుండా పోతున్నాయని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా విద్యార్థులు సాంప్రదాయ వంటకాల పట్ల ఆసక్తినతో వండి ప్రదర్శించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కేవలం డిగ్రీల కర్మాగారం కాదని, మన సంస్కృతిని, మూలాలను కాపాడే ధర్మపీఠమని ఈ ప్రదర్శన నిరూపించింది. జానపదం అంటే కేవలం పాట, ఆట మాత్రమే కాదు; మన ఆహార అలవాట్లు కూడా అందులో అంతర్భాగమే. మన పూర్వీకులు తిన్న తిండే మనకు ఆరోగ్యం, ఆయువు. నేటి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో యువత రోగాల బారిన పడుతున్న తరుణంలో, మన విద్యార్థులు ఈ రకమైన సాంప్రదాయ వంటల ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం” అని కొనియాడారు.


