కోళ్ల ఫారంలో డ్రగ్స్ తయారీ గుట్టురట్టు
మహబూబ్‌నగర్ : జూలై 19/(జన సంఘర్షణ)
మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్‌లోని ఓ కోళ్ల ఫారంలో గుట్టుగా నిర్వహిస్తున్న అల్ప్రాజోలం తయారీ కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. దాడుల్లో కిలోకు పైగా అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడు మలేలా జయప్రకాశ్ గౌడ్‌తో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో గుర్తించిన మరో 23 మంది పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భూత్‌పూర్‌లోని పౌల్ట్రీ ఫారంలో అక్రమంగా అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు పోలీసుల తెలిపారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో ముడి రసాయనాలు, తయారైన అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకుని తయారీ యూనిట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడు మలేలా జయప్రకాశ్ గౌడ్ 2025లో బోయిన్‌పల్లి ప్రాంతంలో అల్ప్రాజోలం తయారీ కేసులో అరెస్టై ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు స్వగ్రామమైన భూత్‌పూర్‌లో మళ్లీ డ్రగ్స్ తయారీ ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కృష్ణయ్య గౌడ్ మరో కీలక నిందితుడిగా ఉన్నాడని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
*తాటి కల్లులో కల్తీకి వినియోగం*
దర్యాప్తులో నిందితులు తాటి కల్లులో కల్తీ చేయడానికి అల్ప్రాజోలంను తయారు చేస్తున్నట్లు వెల్లడించారని ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలను జీడిమెట్ల, ప్రశాంత్‌నగర్, ఫతేనగర్, బాలానగర్ ప్రాంతాల నుంచి సరఫరా చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న రసాయనాల సరఫరాదారులు, వ్యాపారులను కూడా గుర్తించామని, డ్రగ్స్ తయారీకి సహకరించిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది.


